ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు… ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు నేరుగా మద్దతు ప్రకటించేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. జగన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఆయన దాదాపుగా ప్రతీ రోజూ పొలిటికల్ కామెంట్లతో వైసీపీని, జగన్‌ను సమర్థించే బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇందు కోసం .. టీడీపీపై .. ఆ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తన గత కాలం వైభవాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయకుండా హద్దులు దాటిపోవడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌తో రమణదీక్షితులు భేటీ రాజకీయంగా కలకలం రేపింది. దీంతో టీడీపీ అనేక రకాల విమర్శలు చేసింది. సహజంగా.. బ్రాహ్మణ నేతలే.. ఇందులో ముందున్నారు. వీరిపై ఐవైఆర్ కృష్ణారావు ఉగ్రవాదులు, తీవ్రవాదులంటూ విరుచుకుపడ్డారు. ఇది వివాదాస్పదమవుతోంది.
నవ్యాంధ్రకు చీఫ్ సెక్రటరీగా పని చేశారు ఐవైఆర్ కృష్ణారావు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలోనూ.. ఆయన పాత్ర కీలకం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్ పదవీ విరమణ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి..దానికి రూ. వంద కోట్లు నిధులు కేటాయించి.. దానికి చైర్మన్‌గా ఐవైఆర్‌కు పదవి ఇచ్చేశారు. అంత వరకూ చంద్రబాబుతో సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ఐవైఆర్ ఆ పదవిలో ఉండగానే… చంద్రబాబుపై, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. ఏదో పెద్ద పదవి ఆశించి.. అది ఇవ్వలేదన్న కారణంగానే… ఆయన చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుకున్నారన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. ఆ తర్వాత ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది.
ఇలా వచ్చిన చంద్రబాబు వ్యతిరేకతతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేసే అవకాశం వస్తే.. జగన్ మీడియా ఎందుకు వదులుకుంటుంది..?. అప్పటి నుంచి ఐవైఆర్ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. చివరికి తాను సీఎస్‌గా ఉండి పట్టాలెక్కించిన అమరావతి ప్రాజెక్ట్, స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కోర్టు అడిగే ప్రశ్నలకు తెలియదనే సమాధానాలు చెబుతున్నారు. అంతే కాదు.. “అమరావతి ఎవరిది..?” అంటూ ఓ పుస్తకం రాసేసి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరించేశారు. ఆ తర్వాత కూడా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతీ రోజూ.. చంద్రబాబుపై ఏదో విమర్శ సోషల్ మీడియా వేదికగా చేయకుండా ఉండటం లేదు.
ఏపీకి వ్యతిరేకంగా ఆపరేషన్ గరుడ, మహాకుట్ర జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించడంపైనా.. ఐవైఆర్ కౌంటర్ ఇస్తున్నారు. తిరుమలలో వివాదాలు జరిగితే.. చంద్రబాబు లింక్ పెట్టేస్తున్నారు. రమణ దీక్షితుల ఆరోపణలకూ… నేరుగా ప్రభుత్వానికి అంటగట్టేస్తున్నారు. రమణ దీక్షితులపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తే ఆఖరికి.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనేశారు. ఏపీ ఉన్నతాధికార వర్గాల్లో ఐవైఆర్ వ్యవహారశైలి.. చర్చనీయాంశమవుతోంది. సీఎస్‌గా పని చేసినంతటి గౌరవాన్ని.. వైసీపీకి సోషల్ మీడియా కార్యకర్తలా ..పోస్టులు పెట్టి.. దిగజార్చుకుంటున్నారన్న.. అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై వ్యతిరేకతో.. ఐవైఆర్ కృష్ణారావు విచక్షణ కోల్పోతున్నారని.. టీడీపీ నేతలూ ఆరోపిస్తున్నారు.