“అనుకోకుండా ఒక రోజు ” సినిమా చూసిన వాళ్లకి… ఓ పిచ్చి ఆధ్యాత్మిక మత్తు ఎలా ఉంటుందో.. స్పష్టంగా తెలుస్తుంది. చావడానికైనా.. చంపడానికైనా వారు వెనుకాడరు. ఆ సినిమాలో ఉండే సూర్యస్వామి భక్తులందరూ.. ఎంతో కామన్‌గా కనిపిస్తూంటారు. అన్నీ విషయాలు తెలిసినట్లే ఉంటారు. కానీ తాము నమ్మే సూర్యస్వామి ఏం చెబితే అది చేయడానికి రెడీ అయిపోతారు. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది మృతి వెనుక కూడా.. ఇలాంటి సూర్యస్వామి ఉన్నాడన్న విషయం పోలీసులకు స్పష్టమయింది. ఎలా చచ్చిపోవాలో.. స్వామిజీ వివరించిన సూచనలు.. దానికి సంబంధించి వారు చేసుకున్న ఏర్పాట్లు దాన్ని ధృవీకరించాయి. ఇంకా విశేషం ఏమింటంటే.. ఆ కుటుంబంలో ఉన్న పదకొండు మందికి గుర్తుగా.. పదకొండు ప్లాస్టిక్ పైపులను గోడలకు అతికించారు. ఆ పైపులు.. అతికించడం వెనుక కూడా పిచ్చి ఆధ్యాత్మికత ఉందని మాత్రం పోలీసులకు అర్థమయింది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో.. చేతిరాతతో ఉన్న కొన్ని స్క్రిప్టులు ఉన్నాయి. వాటిలో వివరాలను బట్టి మరణానికి ముందు ఆ కుటుంబ సభ్యులు పది అంశాలను పాటించారు. గురువారం లేదా ఆదివారం ఎంచుకోండి అనే స్పష్టమైన సూచన ఉన్న పేపర్ పోలీసులకు చిక్కింది. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో కూడా… అక్కడ దొరికిన పత్రాల్లో ఉంది. వృద్ధురాలు నిలబడలేకపోతే.. వేరే గదిలో నిద్రపోయేలా చేయాలని రాశారు. ఇక్కడ నిద్రపోవడం అంటే శాశ్వతనిద్ర. చేతులు కట్టేసుకున్నాక ఇంకా ఆ వస్త్రం మిగిలిపోతే.. అజాగ్రత్తగా ఉండేవాళ్లకు వినియోగించాలన్నది మరో పాయింట్. ఎంత అంకిత భావం చూపిస్తే.. ఫలితం అంత ప్రభావంగా ఉంటుందన్నది మరో పాయింట్. ఇలా పది అంశాలు ఎవరో చెప్పినట్లు ఉన్నాయి. వాటిని కుటుంబం పాటించింది. అంటే.. వీరు ఫాలో అవుతున్న మతపరమైన గురువు ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
మరణించడానికి ముందు ఏ విధమైన పెనుగులాట జరగలేదని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆరుగురు కేవలం ఉరి బిగుసుకున్నందునే మరణించారని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. మరో నలుగురికి ఆహారంలో విషం పెట్టి హత్య చేశారని, వృద్ధురాలిని దారుణంగా చంపేశారని గుర్తించారు. ఆత్మహత్యలకు వారు అంగీకరించకపోవడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు వీరు నమ్మే ఆ బాబా ఎవరన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు.