అమిత్ షా వస్తున్నారు..! ఏం చెబుతారు..?

తెలంగాణలో ఎన్నికల భేరీ మోగించడానికి అమిత్ షా వస్తున్నారు. మధ్యాహ్నం అంతా.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి.. సాయంత్రం మహబూబ్‌నగర్‌లో ప్రసంగించేసి.. మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారు. అయితే.. ఈ రోజు పర్యటనలో ఆయన ఇచ్చే సందేశం ఏమిటన్నదే.. బీజేపీ తెలంగాణ నేతలకు ఉత్కంఠకు గురి చేస్తోంది. ఓ వైపు సిట్టింగ్ సీట్లు గెలిపించేందుకు కేసీఆర్.. అభయహస్తం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.. మరో వైపు… బీజేపీ నీడ కూడా.. తన పార్టీపై పడకూడదని.. కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అమిత్ షా పర్యటన అందరికీ కాస్త ఆసక్తి కలిగించేదే.

అమిత్ షా.. బహిరంగసభలో.. ఏం ప్రసంగించినా.. ఆయనకు.. రెండు వైపు నుంచి కౌంటర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని బీజేపీ చెబుతోంది. అటు టీఆర్ఎస్ కూడా చెబుతోంది. లోపాయికారీ అవగాహన కూడా లేదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. అంతేనా.. ఎవరూ ఏమీ అనుకోకుండా.. అప్పుడప్పుడు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అమిత్ షా… కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించక తప్పని పరిస్థితి. పాలన బాగోలేదని… ప్రజల్ని వంచించారని..మరొకటని రొటీన్‌గా విమర్శలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే.. సాక్షి పార్లమెంట్‌లోనే… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు .. గొప్ప పనిమంతుడు.. అభివృద్ధి కాముకుడనే సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాన్ని ఫ్రేమ్ కట్టుకుని… అవకాశం ఉన్నా లేకపోయినా కేసీఆర్ ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలా విమర్శలు వస్తాయి.

సరే.. పాత కమిట్‌మెంట్లు అడ్డు పడ్డాయని… కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శించి వెళ్తే.. వర్కవుట్ అవుతుందా..అంటే.. అది ఇంకా డేంజర్. ఎందుకంటే.. ప్రధాన ప్రత్యర్థిగా .. టీఆర్ఎస్‌ ఉంటే… ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద మనిషి.. కాంగ్రెస్‌ను విమర్శించి పోతున్నారనే విమర్శలు మూటగట్టుకోవాలి. అది మాత్రమే.. కాదు.. టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారన్న.. విషయానికి మరింత బలం చేకూరుతుంది. ఇది బీజేపీకి ఇబ్బందికరం కాదులే కానీ… టీఆర్ఎస్ కు మాత్రం నష్టం చేకూర్చేదే. ఏ విధంగా మాట్లాడినా.. బీజేపీ చిత్తశుద్దిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు కాదు..మోడీ విజయాలను చెప్పి వెళ్లిపోదామన్నా.. జరగబోయేది ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అందులో మోడీ గొడవమేమిటన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఇప్పుడు బీజేపీ అధినేత.. రెండు వైపులా పదునున్న కత్తిని చంకలోపెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు. అది ఎవర్ని గాయపరుస్తుందో.. మరి..! ప్రతిపక్షాలనా.. లేక సొంత పార్టీనా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.