కేరళ శబరిమలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంలో ఇప్పటి వరకూ… యాభై ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం లేదు. కానీ సుప్రీంకోర్టు.. ఈ నిషేధాన్ని ఎత్తి వేస్తూ తీర్పు వెల్లడించింది. మహిళలకు సహజంగా వచ్చే రుతుస్రావ సమస్యలను కారణంగా చూపుతూ..ఇంత కాలం ఆలయ వర్గాలకు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. వీటిపై సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో వారికి నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని వ్యాఖ్యానించింది. ఆలయాల్లో లింగవివక్షకు తావులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.మతమనేది ప్రాథమిక జీవనవిధానంలో భాగమేనని సీజే దీపక్ మిశ్రా అన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. దశాబ్దాల నుంచి ఉంది. అక్కడ దీనిపై రాజకీయం కూడా జోరుగా నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా.. ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతున్న సమయంలో.. కేరళ ప్రభుత్వం ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పించాల్సిందేనన్న వాదన వినిపించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
2007లో కేరళలో అధికారంలో ఉన్న అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని పట్టుబట్టింది. దాని కోసం కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సీన్ మారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో… సుప్రీకోర్టులో కేసు కడా వాదనకు రావడంతో అనుకూలంగా కేరళ ప్రభుత్వం వాదించింది. దీంతో మహిళల ఆలయ ప్రవేశానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. కొసమెరుపేమిటంటే… కొద్ది రోజుల కిందట వచ్చిన వరదలకు… ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి లింక్ పెట్టి చాలా మంది విమర్శలు చేశారు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వారంతా ఇప్పుడు ఎలా స్పందిస్తారో మరి..!