ప్రొ.నాగేశ్వర్: బ్యాంకుల్ని ముంచిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టరు..?

ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం – ఆర్బీఐ మధ్య వివాదం నడుస్తోంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కేంద్రం.. బలహీనం చేస్తోందని.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో… బ్యాంకులకు భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్బీఐ దాస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. ఏవో కారణాలు చెప్పి.. ఆ జాబితాను మాత్రం బయటపెట్టడం లేదు. అయితే.. ఇటీవలి కాలంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న మాడభూషి శ్రీధర్.. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారి వివరాలు వెల్లడించాల్సిందేనని ఆదేశించారు. అయితే ఆర్బీఐ దీనికి సిద్ధపడటం లేదు.

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారెవరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా..?

మాడభూషి శ్రీధరాచార్యులు తెలుగువ్యక్తి. ఆయన చాలా సంచలనాత్మకమైన ఆదేశాలు ఇస్తున్నారు. ప్రధాని మోడీ విద్యార్హతల వివరాలను చెప్పాలని కూడా సంబంధింత శాఖకు ఆదేశాలు ఇచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు శ్రీధరాచార్యులు.. ఏమని ఆదేశాలు ఇచ్చారంటూ.. బ్యాంకులకు.. భారీగా అంటే.. రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారెవరు.. కనీసం వడ్డీ కట్టని వారెవరో తెలుసుకునే హక్కు సామాన్య పౌరులకు ఉంది. కాబట్టి… ఆ సమాచారాన్ని అంతా ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడే కాదు.. 2017లో నే భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకులకు అప్పు పడి.. అప్పు కట్టని వాళ్ల పేర్లు చెప్పమని.. ఆదేశించింది. దేశంలోని బ్యాంకుల వ్యవహారాలన్నింటినీ నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంకుకే అన్ని బ్యాంకులు జవాబుదారీగా ఉంటాయి. బ్యాంకింగ్‌లో కూడా.. చిత్రమైన భాష ఉంటుంది. ఎవరైనా ఖాతాదారుకు… లబ్ది చేకూరిస్తే.. సబ్సిడీ అంటారు. అదే.. పారిశ్రామిక వేత్తలకు అయితే ఇన్సెంటివ్స్ అంటారు. అదే రైతులకు… అప్పులు మాఫీ చేస్తే.. రుణమాఫీ అంటారు. అదే పారిశ్రామిక వేత్తలకు… చేస్తే.. కార్పొరేట్ డెబిట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఎంత గౌరవం చూపిస్తారో..?. అప్పులు తీసుకుని ఎగ్గొడుతున్న వాటికి.. నిరర్థిక ఆస్తులు అని పేరు పెట్టారు. వీటిని నియంత్రించే అధికారం కూడా.. ఆర్బీఐకి ఉంది.

సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు పేర్లు బయట పెట్టడం లేదు..?

సుప్రీంకోర్టు ఆదేశించిన కూడా… ఆర్బీఐ.. ఇప్పటికీ.. అలా డబ్బులు ఎగ్గొట్టిన వారి వివరాలను బయటపెట్టలేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ చెబుతున్న సాకు ఏమిటంటే.. దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెబుతోంది. వేల కోట్ల అప్పు తీసుకుని.. బ్యాంకుల్ని ముంచి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతూంటే.. పేరు చెప్పడానికి ఆర్బీఐ ఎందుకు వెనుకాడుతోంది..? . అలా వెల్లడించడం వల్ల దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఏ విధంగా విఘాతం కలుగుతుంది. ఇంకో కారణం ఏమి చెబుతోందంటే.. బ్యాంకు, వినియోగదారుల మధ్య ఉన్న్ అప్పు ఇచ్చిన, తీసుకున్న వ్యక్తి మధ్య రిలేషన్ ఉంటుంది. అలాంటి వివరాలు ఎలా బయటపెడతామని అంటున్నారు. ఇక్కడ అందరివీ బ యటపెట్టమని అడగడం లేదు. అప్పు ఎగ్గొట్టిన వారి వివరాలనే బయటపెట్టమంటున్నారు. వాళ్లు ప్రజల సొమ్ము తీసుకుని జల్సాలు చేస్తున్న వారి పేర్లు పెట్టమంటే.. తమది పవిత్ర బంధమని చెబుతున్నారు. ఎందుకిలా చెప్పాల్సి వస్తోంది..?

బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్లను పోటీకి అనర్హులుగా ప్రకటించలేరా..?

మాడభూషి శ్రీధరాచార్యులు… వారి పేర్లుబయటపెట్టని ఆదేశిస్తూ.. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అప్పులు తీసుకుని ఎగ్గొట్టబడిన ఖాతాదారాలు ముఖ్యమా..? ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు జవాబుదారీగా ఉండటం ముఖ్యమా ..? అని అడిగారు. బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలా..? ఆ డిపాజిట్ల ను అప్పులుగా తీసుకున్న వారి పట్ల బాధ్యతగా ఉండాలా..? అన అడిగారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోతే.. ఇక చట్టబద్ధమైన పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ పేర్లు చెప్పడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి..? ఇదంతా ప్రజల సొమ్మే కదా..?. వేల కోట్లు అప్పులు తీసుకున్న వారు పార్లమెంట్‌లో కూర్చుంటున్నారు. ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే పోటీకి అనర్హత అంటున‌నారు. అదే ఇరవై వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టినా… పోటీకి అనర్హుడు కాదు. భారతదేశంలో ఎవరైనా ఓ వంద కోట్లు.. వెయ్యి కోట్లు అప్పు తీసుకుని.. బ్యాంకులకు ఎగ్గొడితే.. పోటీకి అనర్హుడిగా ప్రకటించే చట్టం ఎందుకు చేయరు. ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే.. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.

నవంబర్ పదహారో తేదీ గడువు – ప్రకటిస్తారా లేదా..?

రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికీ ప్రకటిస్తోంది. బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో 10.2 శాతం మొండి బాకీలుగా మారాయని రిజర్వ్ చెబుతోంది. సెప్టెంబర్ 2017 వరకూ ఈ లెక్క ఉంది. అంటే.. వంద కోట్లు అప్పు ఇస్తే 10 కోట్లు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. ఇప్పటికి బ్యాంకులకు.. 12 లక్షల కోట్లకుపైగా నిరర్థక ఆస్తులు తేలాయి. ఇలా అప్పులు చేసి ఎగ్గొడుతున్న వారి జాబితాతో ఏమిటో చెప్పమంటే.. మాత్రం చెప్పడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినా.. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేశించినా చెప్పడం లేదు. కానీ బస్టాండ్లలో జేబు దొంగలు పెట్టి.. వీళ్లతో జాగ్రత్త అని ఫోటోలు పెడుతూ ఉంటారు. పర్సులు కొట్టేసేవాళ్లు పేర్లే చెబితే… వేల కోట్లు తీసుకున్న వారి పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు. సెక్షన్ సెవన్ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ పై అధికారం చెలాయిస్తున్న .. కేంద్రం.. అదే సెక్షన్ ప్రకారం… ఆ డబ్బులు ఎగ్గొట్టిన వారి పేర్లను ఎందుకు అడగదు. అలాగే..ఈ అప్పులు వసూలు చేయడానికి… ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని… కేంద్రాన్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేసించారు. నవంబర్ పదహారో తేదీ వరకు సమయం ఇచ్చారు. మరి ఈ తేదీ లోపు… సమాధానం ఇస్తారో లేదో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదు. సీఐసీ ఆదేశాలను అయినా పాటిస్తారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.