టాలీవుడ్లో అడ్వాన్సు పంచాయితీలు మామూలే. ఓ హిట్టుకొట్టాక.. నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, తీసుకున్నవాళ్లందరికీ సినిమాలు చేయక… ఆ అడ్వాన్సుతో పాటు పెనాల్టీ కూడా కట్టేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా ఈ పంచాయితీ విక్రమ్ కె.కుమార్ విషయంలోనూ నడిచింది. 13 బి, ఇష్క్ సినిమాలతో జోరుగా దూసుకుపోతున్న విక్రమ్ కె.కుమార్ చేతిలో అప్పట్లో చాలా అడ్వాన్సులు వచ్చిపడ్డాయి. వాటిలో అశ్వనీదత్దీ కూడా ఉంది. ఇష్క్ సినిమా తరవాత వైజయంతీ మూవీస్‌లో విక్రమ్ ఓ సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. ఆ తరవాత మనం వచ్చింది. ఆ తరవాత 24… ఇలా వేరే సంస్థలతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. కానీ వైజయంతీ మూవీస్‌తో జట్టు కట్టలేదు. ఇదే విషయంపై చాలా రోజుల నుంచి ఫిల్మ్ ఛాంబర్, దర్శకుల సంఘంలో పంచాయితీ నడుస్తోంది. చివరికి విక్రమ్ కె.కుమార్‌కి ఫైన్ వేశారు సినీ పెద్దలు. విక్రమ్ కె.కుమార్ తదుపరి సినిమాని ఏ బ్యానర్లో అయినా చేయొచ్చు..కానీ ఆ పారితోషికంలో రూ.1.5 కోట్లు అశ్వనీదత్‌కి చెల్లించాలి. ఇదీ పెద్ద మనుషుల తీర్పు. విక్రమ్‌కి అప్పట్లో ఎంత అడ్వాన్సు ఇచ్చారో తెలీదు గానీ.. ఈ డబ్బులతో వైజయంతీ మూవీస్ ఓ చిన్న సినిమా ప్లాన్ చేసుకోవొచ్చు. అన్నట్టు… విక్రమ్ తదుపరి సినిమా నాని కథానాయకుడిగా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాత ఎవరో తేలితే.. వాళ్లిచ్చే అడ్వాన్సు చెక్కు.. వైజయంతీ చేతిలో పెట్టేసుకోవొచ్చు.