నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు జనసేన పేరు పలవరించిన సంగతి తెలిసిందే. కోదండరాం పార్టీ పేరు తెలంగాణ జన సమితి అయితే చంద్రబాబు, ప్రజా కూటమిలో తెలుగుదేశం , కాంగ్రెస్ తో పాటు జనసేన కూడా ఉంది అంటూ పలికారు. అయితే వెంటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ తెలంగాణ జనసేన అంటూ కోదండరామ్ పార్టీ పేరును ప్రస్తావించారు. నిజానికి కోదండరాం పార్టీ పేరు అది కూడా కాదు, అది తెలంగాణ జన సమితి. అయితే తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పేరుని చంద్రబాబు పొరపాటున ప్రస్తావించడాన్ని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
ఈరోజు అమలాపురంలో చేనేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఆ సభలో మాట్లాడుతూ జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం లేదని ఇదివరకే చెప్పామని, అయినా కూడా చంద్రబాబుకి మనసంతా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ నిండిపోయాడని, అందుకే “తమ్ముళ్లూ, జనసేన కూడా కలవాలి, కలవాలి” అంటూ చంద్రబాబు అంటున్నాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా చంద్రబాబు కి జనసేన అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఒకలాంటి భయం వచ్చేసిందని , త్వరలోనే ఓడిపోబోతున్నామని చంద్రబాబు కి అర్థం అయిందని, అందుకే జనసేన జనసేన అంటూ ఇలా కలవరిస్తున్నాడు అని చంద్రబాబు పై పంచ్ లు విసిరాడు పవన్ కళ్యాణ్.
ఇక ఈ రోజుతో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా యాత్ర ముగుస్తుంది. మొత్తం మీద ఈ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ యాత్ర భారీ గా సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు.