తెలుగుదేశం పార్టీ అధినేతను రాజకీయంగా అంతం చేస్తామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పష్టంగా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇంత వరకూ చంద్రబాబును తెలంగాణకు విలన్ గా ప్రొజెక్ట్ చేసే పాలసీని పాటించిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఒక్కసారిగా బెదిరింపు ధోరణిలోకి దిగింది. టీడీపీకి అర శాతం.. ఒక్క శాతం ఓట్లు వస్తాయని .. సర్వేల్లో తేలిందని.. ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. కానీ అసలు టీఆర్ఎస్ రాజకీయం మాత్రం.. చంద్రబాబు చుట్టూనే తిరుగుతోంది. కూటమి గెలిస్తే.. చంద్రబాబు పెత్తనం చేస్తారని.. ఆంధ్రా పెత్తనం అవసరమా అంటూ.. ప్రజలను.. రెచ్చగొట్టడం మాత్రమే… ఇప్పుడు… చంద్రబాబు అంతు చూస్తామనే హెచ్చరికలు కూడా వంపుతున్నారు. నిజానికి తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు దూరంగానే ఉండాలనుకున్నారు. టీఆర్ఎస్ నేతలు పూర్తిగా చంద్రబాబును టార్గెట్ చేశారు. కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి.. చంద్రబాబు ప్రచార బరిలోకి దిగారు. దాంతో పరిస్థితి మారిందన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ… కేటీఆర్ ఒక్కసారిగా చంద్రబాబుపై అంతు చూస్తామనేంత అసహనం వ్యక్తం చేయడానికి కారణమేమిటన్నదానిపై… రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రచారంతో గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆందోళనతోనే.. కేటీఆర్ .. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత… గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను.. కేటీఆర్ కు అప్పగించారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కేటీఆర్ కు బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.అదే ఫలితం రిపీట్ చేయాలన్న పట్టుదలతో కేటీఆర్ ఉన్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల బాధ్యతను ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడే పదే పదే ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోననే టెన్షన్ కేటీఆర్ లో ప్రారంభమైదంటున్నారు. దానికి కారణం.. కాంగ్రెస్, టీడీపీ జత కట్టడమే. గ్రేటర్ ఎన్నికల వరకూ.. గ్రేటర్ పరిధిలో..ఎంఐఎం ప్రాబల్యం ఉన్న సీట్లను మినహాయిస్తే.. ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు. టీఆర్ఎస్ ఎప్పుడూ రేసులో లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఈ సారి గ్రేటర్ లో మంచి ఫలితాలు సాధించాల్సి ఉంది. కానీ.. భిన్నమైన కారణాలతో ఈ సారి ఎవరికీ పాజిటివ్ వాతావరణం కనిపించడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుల కారణంగా సంప్రదాయ ఓటర్లు ఓట్లు వేసినా.. కూటమికి సునాయాసంగా విజయాలు లభిస్తాయనే అంచనా ఉంది. దీనికి తోడు.. చంద్రబాబు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లి బరిలో దింపారు చంద్రబాబు. ప్రత్యేకంగా సమయం కేటాయించి రెండు నియోజకవర్గాల్లోనూ రోడ్ షోలు నిర్వహించారు. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. గ్రేటర్లో కారుకు పంచర్ అవుతుంది. అదే జరిగితే.. అధికారం దూరం అవుతుంది. అందుకే.. కేటీఆర్ అసహనానికి గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగానే రాజకీయాల్లో ఇలాంటి అసహనం… ఓటమికి సూచనగా భావిస్తూంటారు.