తెలంగాణలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయాడాన్ని, చంద్రబాబు ప్రచారం చేయడాన్ని “తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టడం”గా కేటీఆర్..భావిస్తున్నారు. ఇదే తరహాలో తాము కూడా రాజకీయం చేస్తామని.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమన్న కేటీఆర్ చాలెంజ్‌తో ఏపీలో రాజకీయంగా కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీలో టీఆర్ఎస్ ప్రత్యక్ష పోటీ ఖాయమేనా..?
కేటీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ ఏపీలోనూ పోటీ చేస్తుందా.. అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ .. తమ రాష్ట్రంలో పోటీ చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ పలుమార్లు చెప్పారు. పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లినప్పుడు.. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు.. ఏపీ ప్రజలు అతిధులుగా భావించి ఇచ్చిన గౌరవ మర్యాదల్ని కేటీఆర్ ఓట్ల పరంగా ఆలోచించి నీరాజనాలు పట్టడంగా లెక్కలేసుకున్నారు. ఏపీలో అక్కడ తాము పోటీ చేస్తే.. ఘన విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. భీమవరం రాజుల్లో తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని.. తనను అందరూ ఆదరిస్తారని.. కేటీఆర్ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ప్రకటనలు పూర్తి కాన్ఫిడెన్స్ తో చేసి ఉంటే.. టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయడం ఖాయమని అనుకోవచ్చు. అలా పోటీ చేస్తే.. అదే మొదటి సారి కాదు. టీఆర్ఎస్ ప్రారంభించిన కొత్తలో విజయవాడతో పాటు మరికొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. అయితే.. గెలవడానికి కాదు. కేవలం.. ఎన్నికల కమిషన్ నిబంధనలను సంతృప్తి పరిచి.. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందడానికి పోటీ చేశారు. ఈ సారి చంద్రబాబును దెబ్బకొట్టడానికి.. రాజకీయంగా అంతు చూడటానికి సొంతంగా పోటీ చేసే ఆలోచనతోనే ఉండొచ్చు.
వైసీపీ, జనసేనలకు పరోక్ష మద్దతుతో “వేలు” పెడతారా..?
ప్రత్యక్షంగా పోటీ చేయకపోతే మరి “వేలు” ఎలా పెడతారన్న సందేహం సహజంగానే వస్తుంది. దానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం.. విపక్షాలకు .. అండదండలు అందించడం. ఏపీలో వైసీపీ, జనసేనలు.. విపక్ష పార్టీలు .. టీడీపీపై పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీలకూ… టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిపై.. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగిన వెంటనే… కేసీఆర్ ఖండించారు. ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆయన భద్రత కోసం అత్యాధునిక వాహనం సమకూర్చారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో సాక్షి పత్రిక… నమస్తే తెలంగాణకు జిరాక్స్ కాపీలా మారిపోయింది. ఇక జనసేన అధినతే పవన్ కల్యాణ్ ప్రగతి భవన్ కు వెళ్లి పరిచయాలు పెంచుకుని వచ్చారు కూడా. అంతకు ముందు.. ఘాటు విమర్శలు చేసిన పవన్.. ప్రగతి భవన్ లో భోజనం చేసిన వచ్చిన తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. పలు ఇంటర్యూల్లో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని.. పదికి ఆరు మార్కులు వేశారు కూడా. ఈ పరిణామాలు చూస్తే.. జగన్, పవన్ లకు.. టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడి.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతుందని అనుకోవచ్చు.
ఏపీలో “ఫెడరల్ మహాకూటమి” ఏర్పాటుతో వేలు పెడతారా..?
తెలంగాణలోలా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసినట్లు ఏపీలో మహాకూటమి ఏర్పాటు చేసి వేలు పెడతారా.. అన్నది మరో సందేహం. వైసీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి.. ఏపీలో మహా కూటమిగా ఏర్పడే అవకాశాన్ని కేటీఆర్ మాటల ద్వారా కొట్టి పడేయలేము. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మహాకూటమి ఏర్పాటు చేస్తామని… ఆయన సీరియస్‌గానే చెప్పారు కూడా. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆయన వరుసగా చేసిన ప్రకటనలు చూస్తే.. దీన్ని తోసిపుచ్చలేము. అదే జరిగితే.. ఓ అద్భుతం జరిగినట్లే భావించారు. అయితే టీఆర్ఎస్ ఇలా టీడీపీకి వ్యతిరేకంగా.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే… అది చంద్రబాబుకు మైనస్ అవుతుందా.. ప్లస్ అవుతుందా అన్నదానిపై …చాలా మందికి క్లారిటీ ఉంటుంది. మరి కేటీఆర్ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తారో..?