రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు రావెల పై విరుచుకు పడుతున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యే గా పోటీ చేయించి, గెలిపించుకుని, పార్టీ తరఫున మంత్రి పదవి కూడా ఇస్తే, ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా ఆయన పార్టీకి రాజీనామా చేశారని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ప్రత్తిపాడు నియోజకవర్గంలో విమర్శలు చేశారు. ఇటు మంత్రి జవహర్ కూడా రావెల కిషోర్ బాబు పై విరుచుకు పడ్డారు. హైదరాబాద్ లో రావెల కిషోర్ బాబు కు వ్యతిరేకంగా సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ రావెల కిషోర్ బాబు ని విమర్శించడం అందరికీ తెలిసిందే అని దాన్ని మర్చిపోయి కూడా రావెల కిషోర్ బాబు జనసేన లో చేరుతున్నారు అంటే ఆయనకు ఆత్మ గౌరవం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు , స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా రావెల కిషోర్ బాబు పై మండి పడుతున్నారు. అయితే రావెల కిషోర్ బాబు పార్టీ వీడడం తో పార్టీ కి పట్టిన మైల పోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొంతమంది టిడిపి నాయకులు, పత్తిపాడు లో నిమ్మగడ్డ వారి పాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్ళతో కడిగి ఆ తర్వాత క్షీరాభిషేకం చేశారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు రావెల కిషోర్ బాబు దెబ్బ తీసినందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని స్థానిక టిడిపి నాయకులు చెప్పుకొచ్చారు.
అయితే ఈ సంఘటనపై దళిత సంఘాలు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ ఇలా ఒక దళిత నాయకుడు పార్టీ వీడినప్పుడు పార్టీ కి పట్టిన మైల పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరం అంటూ వారు వాదిస్తున్నారు. దళిత నాయకులు పార్టీలో ఉంటే పార్టీకి మైల పడుతుందా అంటూ తీవ్ర ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల లో దళితుల పట్ల ఉండే చిన్న చూపు కి నిదర్శనం అని వారంటున్నారు.
దీనిపై తెలుగుదేశం నాయకుడు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.