‘మళ్లీ రావా’తో.. సుమంత్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు తనకు మంచి అవకాశాలే వస్తున్నాయి. తన కొత్త సినిమాలు రెండు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ‘సుబ్రహ్మణ్యపురం’ ఈ వారమే వస్తోంది. ‘ఇదం జగత్’ కూడా రెడీగా ఉంది. మరోవైపు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో అక్కినేనిగానూ కనిపించబోతున్నాడు సుమంత్. ఈ సందర్భంగా సుమంత్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ సుమంత్.
హాయ్ అండీ..
మళ్లీ రావాతో మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్టున్నారు..
అవునండీ.. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. మళ్లీ రావా తరవాత రొమాంటిక్ కథలే ఎక్కువగా వస్తాయనుకున్నా. అదేంటో విచిత్రంగా.. థ్రిల్లర్స్ వస్తున్నాయి. అయితే చేసిన సినిమానే మళ్లీ చేయడం నాకు నిజంగానే ఇష్టం ఉండదు. కొత్త జోనర్లు, కొత్త కథలు ప్రయత్నించడం బాగుంటుంది.
హీరోగా మార్కెట్ పెరుగుతున్నట్టేనా?
మార్కెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదండీ. నాకు నచ్చిన కథలే చేసుకుంటూ వెళ్లాను. ఓ కథ విన్నప్పుడు మంచి అనుభూతి కలగాలి. ఈ సినిమా నేను చేయాలి అనిపించాలి. అలాంటి సినిమాలనే ఒప్పుకుంటున్నా. ఇక్కడో ఫైటు పెట్టండి, ఇక్కడో పాట పెట్టండి అని కూడా అడగను. హీరో బిల్డప్ షాట్లు కూడా నచ్చవు. స్లో మోషన్లో నడుచుకుంటూ రావడం, ఇంట్రడక్షన్ పాట.. ఇవేం నా బుర్రకు ఎక్కవు.
కానీ అలాంటి సినిమాల్ని బాగానే ఎంజాయ్ చేస్తారేమో..?
ఆ ప్రేక్షకుడిగా బాగా ఆస్వాదిస్తా. ఎన్టీఆర్. మహేష్‌బాబు అలాంటి పాత్రలు చేస్తే… సీట్లో కూర్చుని విజిల్స్ వేస్తా. నేను మాత్రం అలా చేయలేను.
ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఎలాంటి కథ..?
దేవుడిపై నమ్మకం లేని ఓ యువకుడి కథ. కానీ గుళ్లంటే చాలా ఇష్టం. వాటిపై పరిశోధన కూడా చేస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా. దర్శకుడు ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలాంటి కథలు నాకు పడవులే.. అని తప్పించుకోవాలని చూశా. కానీ.. రెండు గంటల పాటు దర్శకుడు నన్ను కూర్చోబెట్టేశాడు. ప్రేక్షకులకూ అలాంటి అనుభూతే కలుగుతుందని నా నమ్మకం.
మీరు దేవుడ్ని నమ్ముతారా?
నమ్ముతా. నేను అన్ని గుళ్లకూ వెళ్తా. పూజలు, దండాలు ఇవేం ఎక్కువ ఉండవు. పొద్దుటే షూటింగ్ మొదలెట్టే ముందు తప్పకుండా దేవుడికి దండం పెట్టుకుంటా.
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎఎన్నార్గా నటిస్తున్నారు కదా? క్రిష్ ఈ ప్రతిపాదన చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
చాలా హ్యాపీగా అనిపించింది. ఇదో గౌరవం అనుకున్నా. తాతగారి ఆశీస్సులు ఉండడం వల్లే ఈ పాత్ర దక్కింది.
భయపడ్డారా?
భయాలేం లేవు. నాలో మా అమ్మ పోలికలు కనిపిస్తాయి. మా అమ్మ తాతగారిలా ఉంటుంది. అది నా అదృష్టం. ఇంట్లో వాళ్లు కూడా నన్ను మా తాతగారితో పోలుస్తారు. తాతగారిలా మేకప్ వేసుకుని అద్దం ముందు నిలబడినప్పుడు.. నాకు మా తాతగారు జ్ఞాపకం వచ్చేవారు.
తాతగారిని అనుసరించారా, అనుకరించారా? హోం వర్క్ ఎలా జరిగింది?
అనుసరించలేదు.. అనుకరించలేదు. ఆ మధ్యలో ఓ గీత ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యా. హోం వర్క్ అంటారా, తాతగారి సినిమాలు మళ్లీ చూశా. ఆయన ఇంటర్వ్యూలే పరిశీలించా.
బాలకృష్ణతో పనిచేసిన అనుభవం ఎలా అనిపించింది?
ఆయనో ఎన్ సై క్లోపిడియా. చరిత్ర గురించి చాలా అవగాహన ఉంది. మా తాతగారు చెప్పిన డైలాగుల్ని కూడా అవలీలగా చెప్పేస్తున్నారు. షూటింగ్ మధ్య.. మా మధ్య మంచి ప్రయాణం జరిగింది.
ఇంతకీ పార్ట్ 1లో కనిపిస్తారా, 2లోనా?
రెండింటిలోనూ నా పాత్రకు ప్రాధాన్యం ఉంది.