ఇప్పటి వరకూ లవ్ స్టోరీలు, యాక్షన్ ఎంటర్టైనర్లు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసారి.. ఓ థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు. అదే.. ‘కవచం’. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. కాజల్, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం… ఈనెల 7న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ఇదో మైండ్ గేమ్ నేపథ్యంలో జరిగే కథలా అనిపిస్తోంది. ఓ తెలివైన క్రిమినల్కీ, అంతే తెలివైన పోలీస్ అధికారికి మధ్య జరిగే.. ఘర్షణ ఈ చిత్రం. ‘ప్రతీ ఆటలోనూ గెలుపు ఓటములు ఉంటాయి. ఓటమి నీ తలరాత కాదు, గెలుపు ఒకడి సొత్తు కాదు’ అనే డైలాగ్‌ని బట్టి.. ఈ సినిమా కంటెంట్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవొచ్చు. ట్రైలర్ చూస్తుంటే… ఇదో కిడ్నాప్ డ్రామాలానూ అనిపిస్తోంది. హీరో ఓ ట్రాప్ లో చిక్కుకుంటాడు. అందులోంచి తన తెలివి తేటలతో ఎలా బయటపడ్డాడన్నది కథ. ట్రైలర్ నిండా యాక్షన్ షాట్లు, థ్రిల్లింగ్ మూమెంట్లు కనిపించాయి. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. బెల్లంకొండ కూడా ఎమోషన్స్ బాగానే పండించాడు. `సాక్ష్యం` సినిమాతో చాలా డల్ అయిపోయాడు బెల్లంకొండ. మళ్లీ తనలో జోష్ రావాలంటే… ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర `హిట్` ముద్ర వేయించుకోవాల్సిందే.