తాను ఉన్నంతవరకూ కొడంగల్ కి హైటెన్షన్ వైరు కాపలా ఉన్నట్టేనని అన్నారు కాంగ్రెస్ నేత రేవంత్. సొంత నియోజక వర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గుంట నక్క, దగుల్బాజీ, దోపిడీదారు అంటూ మండిపడ్డారు. కొడంగల్ ప్రజల అండతో తాను కొండనైనా ఢీ కొంటానని, వందల మంది కేసీఆర్లు వచ్చినా పాతాళానికి తొక్కేస్తా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తమ ప్రజల పౌరుషాన్ని డబ్బు మూటలతో కొనాలని చూస్తున్నారనీ, అధికారం ఉంది కదా అని ముఠాలతో బెదిరిస్తున్నారన్నారు. వీటన్నింటికీ ధీటైన సమాధానం ఈ నెల 4న చెబుతామన్నారు రేవంత్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 4న కేసీఆర్ కొడంగల్ వెళ్తున్నారు. ఇప్పటికే తనపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రేవంత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 4న బంద్ కి పిలుపునిచ్చారు. అయితే, బంద్ ఉండదని ఇప్పుడు స్పష్టం చేశారు. 4న తాము పిలుపునిచ్చిన నియోజక వర్గ బంద్ ను ఉపసంహరించుకుంటున్నామనీ… కానీ, ఆరోజున కేసీఆర్ పర్యటనకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామన్నారు రేవంత్. కొడంగల్ నియోజక వర్గంలోని మండలాల పరిధిలో ర్యాలీలు, ధర్నాలూ ఉంటాయనీ, తన పట్టుదల ఏంటో కేసీఆర్ కి అర్థమయ్యేట్టు చేస్తామన్నారు. కొడంగల్ ప్రజలతో పెట్టుకున్నవారెవ్వరూ ఇంతవరకూ బతికి బట్టకట్టలేదనీ, కేసీఆర్ పరిస్థితి కూడా అంతే అంటూ రేవంత్ మండిపడ్డారు.
నిన్నటి రేవంత్ ప్రకటనతోనే కేసీఆర్ కొడంగల్ టూర్ ఉద్రిక్తంగా మారుతుందా అనే వాతావరణం ఏర్పడింది. బంద్ పిలుపుని వెనక్కి తీసుకున్నారుగానీ… ధర్నాలు ఉంటాయని రేవంత్ అంటున్నారు. కాబట్టి, కొంత ఉద్రిక్తతలు ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంటిపై ఐటీ దాడులు మొదలైన దగ్గర్నుంచే… తనను కేసీఆర్ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందనీ, అధికార పార్టీకి చెందినవారే తనని అంతమొందించే స్కెచ్ లో ఉన్నారంటూ గతవారంలోనే రేవంత్ కోర్టును ఆశ్రయించడం, భద్రత పెంచాలని కోరారు. ఇలాంటి పరిణామాల తరువాత సొంత నియోజక వర్గానికి కేసీఆర్ వస్తుండటంతో… ఏదో ఒక రూపంలో రేవంత్ బలప్రదర్శన ఉంటుందని చాలామంది అనుకుంటున్నదే. ఇంతవరకూ అప్రతిహతంగా సాగుతున్న కేసీఆర్ ప్రచార పర్వంలో కొడంగల్ సభలో ఎలాంటి అనుభవాలు ఎదురౌతాయో మరి!