డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే ఒక పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు గుంటూరు జిల్లా, నేలపాడులో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో ఆత్మ గౌరవం పెంచడం కోసమే తాను కృషి చేస్తున్నానని చెప్పారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అనీ, గత 23 ఏళ్లలో 93 లక్షల మంది సభ్యులుగా చేరారన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో ఉండాలంటే ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నా కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు.
భగవంతుడు తనకు శక్తి ఇచ్చినంతవరకూ ఆడబిడ్డల సంక్షేమం కోసం పనిచేస్తాననీ, మూడు విడతల్లో రూ. 10 వేల చెక్కుల్ని అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక్కో డ్వాక్రా మహిళకీ రూ. 10 చొప్పున మూడు నెలల్లో మూడు చెక్కుల ద్వారా ఇవ్వడం ద్వారా రూ. 9400 కోట్లు అందజేస్తున్నామన్నారు. ఈ పథకం కింద ప్రకటించిన మొత్తాన్ని ఏప్రిల్ లోపుగా మహిళందరికీ చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో ఆడపడుచులకు ఒక్క రూపాయి కూడా అక్కడి ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.
దీనిపై వైకాపా మీడియా సాక్షి అప్పుడే విమర్శలకు దిగేసింది. రూ.10 వేలు ఇస్తామని చెప్పి, దాన్ని మూడు విడతలుగా ఇవ్వడమేంటంటూ కథనాలు ప్రారంభించేసింది. పోస్టు డేటెడ్ చెక్కులు ఇవ్వడం ఒక డ్రామా అంటున్నారు. ప్రభుత్వమే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం అనేది ఎక్కడా ఉండదనీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుపై ఇప్పటికే కొంతమంది మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ మొదలుపెట్టేశారు. వాస్తవానికి, డ్వాక్రా మహిళలందరికీ ఒకేసారి రూ. 10 వేలు చొప్పిన విడుదల చేస్తే… రాష్ట్ర ప్రభుత్వంపై ఒకేసారి దాదాపుగా పదివేల కోట్లకుపైగా భారం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా… దశలవారీగా, అంటే నెలలవారీగా ఈ సొమ్మును విడుదల చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది. అందుకే, మూడు దశలుగా చెక్కులిచ్చారు. అంతేతప్ప… వైకాపా విమర్శలు చేస్తున్నట్టు కానే కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలుసు. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా ప్రజలకు తెలిసిందే. అయినా, మహిళలకు ఏదో ఒక రూపంలో సాయం అందుతుంటే… దాన్ని కూడా విమర్శిస్తారేంటో మరి..?