తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర్నుంచీ… ఎన్నికలు నిర్వహించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈవీఎమ్ ల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క, రేవంత్ రెడ్డి, డీకే అరుణలతో సహా పదిమందికిపైగా నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల తీరును సవాలు చేస్తూ పిటీషన్లు దాఖలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ మీద కూడా గజ్వేల్ కి చెందిన శ్రీనివాస్ కేసు వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తనపై 2 క్రిమినల్ కేసులే ఉన్నట్టు కేసీఆర్ పేర్కొన్నారనీ, వాస్తవానికి 64 కేసులు ఆయనపై ఉన్నాయనీ, ఎన్నికల సంఘానికి కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వేసిన ఈ పిటీషన్, సోమవారం విచారణకు రానుంది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుపై ప్రేమ్ సాగర్ కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు. అధికారులతో ప్రమేయం లేకుండా ఈవీఎమ్ లను స్ట్రాంగ్ రూమ్ కి తరలించారంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. పోలింగ్ శాతంలోనూ తేడాలున్నాయనీ, దివాకర్ ను అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొన్నారు. పట్నం నరేంద్రరెడ్డి మీద కూడా ఒక కేసు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు మీద పెట్రోల్ బంకు ఉండకూడదనీ, ఎన్నికల సమయంలో రూ. 51 లక్షల అక్రమ సొమ్ము లభించిందనీ, ఆ సొమ్ము ఎలా వచ్చిందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదంటూ దాఖలైన కేసులో పేర్కొన్నారు.
ఈ కేసుల విషయంలో పూర్తిగా అనుకూలంగానే తీర్పు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. 12 మంది కాంగ్రెస్ నేతలు ఒకేసారి కేసులు వేయడంతో ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతుందనీ, ఇలాంటి కేసుల విషయంలో స్టే ఇచ్చే అవకాశం ఉండదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆధారాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి, విచారణ కొంత మందకొడిగా సాగినా, ఈ తెరాస నేతల ఎన్నిక చెల్లదంటూ తీర్పు వస్తుందనే ఆశాభావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.