ప్రొ.నాగేశ్వర్ : ఏపీ ఎన్నికల్లో జోక్యంపై టీఆర్ఎస్ మాట మారిందా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేలు పెడతామని.. గతంలో.. కేటీఆర్ ప్రకటించారు. కానీ. గత రెండు, మూడు రోజులుగా… కేటీఆర్ ప్రకటనలు వెనక్కి తగ్గినట్లుగా ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో తమ ప్రమేయం ఏమీ ఉండబోదని చెబుతున్నారు. అక్కడ తమకు శాఖలు లేవని.. కార్యాలయం లేదని.. పార్టీ అభ్యర్థులను కూడా పెట్టబోమని అంటున్నారు. గతంతో పోలిస్తే.. ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారు..?

వేలు పెట్టడం, రిటర్న్ గిఫ్ట్‌లు ఏమయ్యాయి…?

తెలంగాణ రాష్ట్ర సమితి ఏపీ ఎన్నికల్లో.. పోటీ చేస్తుందని.. ఎప్పుడూ .. ఎవరూ అనుకోలేదు. కానీ.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు విషయంలో మాత్రం.. ఆ పార్టీ వైఖరి ఇప్పుడు స్పష్టంగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తొలి ఎన్నికల ప్రచార సభలో.. చంద్రబాబుపై ఆచితూచి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. చంద్రబాబుపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం… చాలా పరిమితంగా చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. కరీంనగర్ సభలో తనను మూడు వేల తిట్లు తిట్టారని, ఓడిస్తారని భయపడుతున్నారని మాత్రమే అన్నారు. అంటే.. ఆంధ్రా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా.. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాలపై ఏమైనా ప్రకటన చేస్తారేమో అని అనుకున్నారు కానీ.. ఏమీ చేయలేదు. కేటీఆర్ కూడా.. అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఏపీ రాజకీయాలపై.. తమకు ఆసక్తి లేదంటున్నారు. కానీ వారికి ఆసక్తి ఉందని.. గతంలోనే నిరూపించారు. నేరుగా.. జగన్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. పలుమార్లు జగన్ గెలుస్తారనే ప్రకటన చేశారు. కేసీఆర్ కూడా.. నేరుగా .. విజయవాడకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని ప్రకటించారు. కానీ.. ఇప్పటి వరకూ అలాంటి భేటీ జరగలేదు. ఈ కలయిక ఎందుకు ఆగిపోయిందనేది.. ప్రధానమైన ప్రశ్న..!

ఏపీలో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు సాగుతున్నాయని అంచనాకు వచ్చారా..?

ఆంధ్రలో వేలు పెడతామన్న కేటీఆర్, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనల తర్వాత… ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు.. ఎన్నికలు.. తనకు.. , కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని ప్రకటిస్తున్నారు. అలాగే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పిడికెడు సీట్లకు పోటీ చేస్తే.. చంద్రబాబు .. తెలంగాణపై దండయాత్రకు వస్తున్నట్లుగా ప్రచారం చేశారు. అదే ప్రచారాస్త్రంగా ప్రధానంగా గెలుపు సాధించారు. దాన్నే ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నారు. చాలా మంది రాజకీయ నేతల్లో ఇదో స్ట్రాటజీ అనే అభిప్రాయం ఉంది. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లు సాగుతుంది.. కానీ మధ్యలో… జగన్మోహన్ రెడ్డి ఎందుకొచ్చారో ఎవరికీ అర్థం కాదు. టీఆర్ఎస్‌తో అంతగా.. సంబంధాలు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నేరుగా కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం.. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వాములు అవ్వాలని అనుకోవడం లాంటివి… ఆశ్చర్యకరమే. ఎందుకంటే.. టీఆర్ఎస్‌తో కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి.. ఒక్క ఓటు అయినా అదనంగా వస్తుందా..?. కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కరైనా… ఇది వైసీపీకి మైనస్ అవుతుందని అంచనా వేస్తారు.

సెంటిమెంట్ పెరుగుతుందని వెనక్కి తగ్గారా..?

తెలంగాణలో… ఆంధ్ర ఓటర్లు ఉన్నారు. కానీ ఆంధ్రలో తెలంగాణ ఓటర్లు లేరు. వైసీపీతో కలవడం వల్ల టీఆర్ఎస్‌కు ఏమైనా జరుగుతుందేమో కానీ.. అదనంగా వైసీపీకి ఒక్క ఓటు రాదు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… కేసీఆర్‌ను కలిసినట్లు చెబుతున్నారు. తన ప్రత్యర్థి .. టీడీపీ అధినేత చంద్రబాబు… జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ రాజకీయాల కోణంలో తాను వెనుకబడుతున్నానేమో అన్న ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డి ఫెడరల్ ఫ్రంట్‌ చర్చల్లో కేటీఆర్‌ను ఆహ్వానించడానికి సిద్ధపడ్డారని అనుకోవచ్చు. అయితే… కాంగ్రెసేత, బీజేపీయేతర పార్టీల కూటమి ప్రకారం.. జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ.. ఒక్కటంటే.. ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. అంటే.. కేసీఆర్ నాయకత్వంలో… జాతీయ రాజకీయాల్లో జగన్ పని చేస్తారని అంచనా వేసుకోవచ్చు. అలాగే.. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఇవి .. నష్టం చేస్తాయని.. రెండు పక్షాలకు అర్థమయింది. అందుకే… జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. కేసీఆర్ చంద్రబాబు గురించి అసలు మాట్లాడటం లేదు. కేటీఆర్… తమకు ఏపీ రాజకీయాలపై ఆసక్తి లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పెరిగినట్లుగానే… ఏపీలో పెరుగుతుందని భావించి.. జాగ్రత్త పడుతున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.