రాజధానిని జగన్ ఎందుకు మారుస్తున్నారు..? ఇది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. పది వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టిన అమరావతిని.. మంత్రులు చెప్పినట్లుగా స్మశానం చేసేసి.. ఇప్పటికే మెట్రో సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖకు.. రాజధానిని జగన్ మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారో మాత్రం.. ఎవరికీ క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కట్టేస్తామని గతంలో జగన్ తన స్వప్నాన్ని ఆవిష్కరించారు. గ్రీనరీ ఉండాలని..విశాలమైన రహదారులు కావాలని.. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఓ యూఫోరియా క్రియేట్ చేస్తానని.. తన ఆలోచనలు ఆవిష్కరించారు. తీరా ఆ నగరాన్ని తీర్చిదిద్దే అవకాశం ప్రజలు ఇచ్చే సరికి జగన్.. తన పాత స్వప్నాన్ని మర్చిపోయారు. ఇప్పుడు.. పునాదులు పడిన నగరాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు.
జగన్ తన ప్రపంచస్థాయి రాజధాని ఆలోచనల్ని.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా పంచుకున్నారు. కనీసం ముఫ్పై వేల ఎకరాలు ఉండాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ ఎకరాల్ని రైతుల్ని ఒప్పించి..మరీ సాధించి పెట్టింది.తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చేశారు. నిజానికి విశాఖ పట్నం రాజధానిగా పనికి రాదన్నది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం. అక్కడ తుపాన్లు వస్తాయని.. పొల్యూషన్ ఎక్కువని గతంలో తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాంటి చోటికే.. ఇప్పుడు తాను స్వయంగా రాజధానిని తరలించాలని అనుకుంటున్నారు.
రాజధాని విషయంలో జగన్ ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలకు.. ముఖ్యమంత్రిగా చేస్తున్న చేతలకు అసలు పొంతనే లేదు. అమరావతికి సాక్షాత్తూ అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు పలికి.. తాను రాజధానిని అమరావతిలోనే ఉంచుతానని.. ఎన్నికల ప్రచారంలో నమ్మబలికి.. ఇల్లు కూడా కట్టుకున్నానని.. పదే పదే చెప్పి.. చివరికి… తన అంతర్గత అజెండా అమలు చేస్తున్నారు. ఈ అంతర్గత ఎమిటన్నదే ఎవరికీ అర్థం కాని విషయం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతిని వ్యతిరేకించి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేదేమో కానీ.. ఆయన నిట్ట నిలువుగా మోసం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుతోంది. అందుకే.. 2019ని తాము మోసపోయిన ఏడాదికి ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఆయన చెప్పే మాటలపై.. అందరూ అనుమానాస్పదంగా చూసే పరిస్థితి ఏర్పడింది. అమరావతిపై గతంలో ఆయన మాటలు.. ఇప్పుడు చెబుతున్న మాటలు.. ” క్యారెక్టర్ సర్టిఫికెట్”గా మారిపోయాయన్న ప్రచారం జరుగుతోంది.