కరోనాపై పోరాటానికి చైనాలో వెయ్యి పడకల ఆస్పత్రిని హుటాహుటిన నిర్మించినట్లుగానే.. తాము 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశామని తెలంగాణ సర్కార్ కొన్నాళ్ల కిందట ఘనంగా ప్రకటించింది. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపారని..ఇతర టీఆర్ఎస్ నేతలు పొగిడారు. తెలంగాణ సీఎం కూడా.. ఓ గొప్ప ఆస్పత్రి సిద్ధమయిందని.. కరోనా ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఆ ఆస్పత్రిని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే టిమ్స్‌గా మారుస్తామని ప్రకటించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న భవనంలో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో అన్ని రకాల మెడికల్ ఎక్విప్ మెంట్స్‌ను సమకూర్చామని.. వంద మంది డాక్టర్లు నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు.
అంత వరకూ బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ ఆస్పత్రిలో ఒక్కరంటే.. ఒక్క కరోనా పేషంట్‌ను చేర్చలేదు. తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు సరిగ్గా లేవంటూ… కరోనా లక్షణాలు ఉన్న వారిని ఇళ్లలోనే ఉంచేస్తున్నారు., కొంత మందిని పూర్తిగా తగ్గకుండానే ఇంటికి పంపించేస్తున్నారు. ఇలాంటి సమయంలో పదిహేను వందల పడకల ఆస్పత్రి సిద్ధంగా ఉంటే.. ఎందుకు ఉపయోగించుకోవడం లేదనే చర్చ సహజంగానే ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. అసలు ఆ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదు.. రోగుల్ని అక్కడకు ఎందుకు తీసుకెళ్లడం లేదని అని పరిశీలించడానికి ప్రత్యక్షంగా ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడ ఆస్పత్రికి ఉండాల్సిన ఏర్పాట్లేమీ కనిపించలేదని ఆయన మండిపడ్డారు. కనీసం మురుగునీటి పారదల వ్యవస్థ కూడా లేదని.. విమర్శించారు. రేవంత్ ఆ ఆస్పత్రిని పరిశీలించడానికి వెళ్లిన సమయంలో.. సెక్యూరిటీ తప్ప ఎవరూ లేరు. అయితే.. పేషంట్ల కోసం కొన్ని బెడ్లు.. ఇతర సౌకర్యాలను కల్పించారు. అది కరోనా పేషంట్లకు చికిత్స చేసేంతగా సిద్ధం కాలేదన్న అభిప్రాయం.. రేవంత్ వ్యక్తం చేశారు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఆర్భాటంగా.. తెలంగాణ సర్కార్ చేసిన గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ఏర్పాట్లను మధ్యలోనే ఎందుకు వదిలేశారన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.