అమరావతిలో దొంగలు పడ్డారు. అక్కడ నిర్మాణ సామాగ్రిని దోచుకెళ్లిపోయారు. ఇసుక, ఇటుకలు, కంకర, స్టీల్ తో పాటు నిర్మాణానికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను ఎత్తుకెళ్లిపోయారు. రెండేళ్ల నుంచి పనులు జరగకపోవడంతో… మెటీరియల్‌ను కాంట్రాక్ట్ సంస్థలు అక్కడే ఉంచాయి. ఎప్పుడైనా ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించమని కోరుతుందేమోనని.. ఎదురు చూస్తున్నాయి. ఇటీవల… కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మిగిలిపోయిన నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అందు కోసం అప్పు తీసుకోవాలని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. ఈ క్రమంలో తమ మెటీరియల్‌ను చూసుకోవడానికి వచ్చిన ఆయా కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు అవాక్కయ్యారు. టన్నుల కొద్దీ ఉండాల్సిన ఇసుక మాయమైపోయింది. ఇరన్, కంకర కూడా క నిపించలేదు. నిర్మాణ సామాగ్రి కూడా.. విలువైనవి దొంగిలించుకు వెళ్లిపోయారు. ఎల్ అండ్ టీ, గాయత్రితో పాటు షాపూజీ సంస్థలు గతంలో అక్కడ నిర్మాణాలు చేస్తున్నాయి. తమ మెటీరియల్ మాయం కావడంతో ఆ సంస్థల ప్రతినిధులు.. తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇసుక బంగారం అయిపోయింది. దీంతో అమరావతి నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున ఆయా సంస్థలు తెచ్చి పెట్టుకున్న ఇసుకను … అవకాశాన్ని బట్టి కొంత మంది దొంగిలించుకెళ్లిపోయారు. అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో ఇక కంకర, ఐరన్‌తో పాటు … భారీభవనాల నిర్మాణానికి ఉపయోగించే యంత్రాల్ని కూడా పట్టుకెళ్లిపోయారు. ప్రభుత్వం అమరావతి విషయంలో వ్యతిరేకంగా ఉండటంతో అక్కడ భద్రత కల్పించడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తానికి అమరావతిలో దొంగలు పడ్డారని సైటైర్లు పడుతున్నాయి.