తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఇప్పుడు బాధ్యతలు పెరిగినట్లుగా ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ గతంలో ఆయన హైదరాబాద్‌లో కన్నా సొంత నియోజకవర్గం సిద్ధిపేటలోనే ఎక్కువగా ఉండేవారు. అయితే ఈటల ఎపిసోడ్ టీఆర్ఎస్లో ప్రారంభమైన తర్వాత… హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈటలను ఆరోగ్య శాఖ నుంచి తప్పించి.. ఆ శాఖను సీఎం కేసీఆరే తీసుకున్నారు. ఆ బాధ్యతలు హరీష్ రావును చూసుకోవాలని అనధికారికంగా సూచించారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌కు మాత్రం.. కేటీఆర్‌కు నాయకుడిగా చేశారు.
దాంతో ఆర్థిక శాఖతో పాటు ఆరోగ్య శాఖను కూడా చూస్తున్న హరీష్ రావు.. ఇప్పుడు… కొత్తగా మరిన్ని బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ఉద్యోగాల భర్తీపై సమీక్షలు ప్రారంభించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో హరీష్ రావు భేటీ అయ్యారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. భర్తీ ప్రక్రియ ఎలా చేపట్టాలి వంటి వాటిపై చర్చించారు. ఉద్యోగాల భర్తీతో పాటు.. రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టంలోని.. షెడ్యూల్ 9, 10లో ఉన్న కార్యాలయాలు, ఆస్తులపైనా చర్చించారు.
హరీష్ రావు దూకుడు.. అధికార వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. సీఎం కేసీఆర్ ఆజ్ఞ లేనిదే.. హరీష్ రావు అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. కేసీఆర్ చెప్పబట్టే.. ఈ సమీక్షలన్నీ హరీష్ చేస్తున్నారని అంటున్నారు. ఈటల ప్రెస్మీట్లలో తరచూ హరీష్ రావుకు కూడా అవమానం జరిగిందని.. జరుగుతోందని చెబుతూ వస్తున్నారు. దీనిపై హరీష్ ఓ సారి ఖండన ప్రకటన ఇచ్చారు. ఈ తరుణంలో హరీష్‌కు ప్రాధాన్యత వ్యూహాత్మకంగానే ఇస్తున్నారని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది.