యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన కేసీఆర్ .. ఆలయ ప్రారంభోత్సవానికి వేస్తున్న ప్రణాళికలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికి రెండు, మూడు సార్లు ఆయన చినజీయర్ స్వామిని కలిసి.. ప్రారంభోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో చేయడానికి అవసరమైన కార్యక్రమాలపై చర్చించారు. ఏడాది కిందటే… ఆలయ ప్రారంభోత్సవానికి కొన్ని తేదీలను అనుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించాలనుకునేసరి.. మహమ్మారి వచ్చేసింది. అప్పట్నుంచి ఆలయ ప్రారంభోత్సవానికి ఏ తేదీ కుదరదడం లేదు. గత ఏడాది చినజీయర్ స్వామిని కలిసినప్పుడు.. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేయాలని అనుకున్నారు. అప్పటికల్లా యాదాద్రి పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
ఫిబ్రవరిలో కాలం కలసి రాలేదు. ఆ తర్వాత మే నెలలో ఆలయ ప్రారంభోత్సవాన్ని కనివినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. 1,048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగం కూడా చేయాలని కూడా కేసీఆర్ ప్రణాళికలు వేసుకున్నారు. కానీ నిర్మాణ పనులు మాత్రం ఆయన ఆశించినంత వేగంగా సాగ లేదు. కీలకమైన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కరోనా కూడా పనులు మందగించడానికి ఓ కారణం. అయితే ఆలయ కట్టడాలతో పాటు సుందరీకరణ పనులన్నీ తుది దశకు చేరాయి. కేసీఆర్ తరచూ యాదాద్రిపై సమీక్షలు చేస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి తెలంగాణలో రాజకీయ మార్పులకు సంబంధం ఉందన్న చర్చ కూడా కొంత కాలంగా సాగుతోంది. గత ఏడాది డిప్యూటీ స్పీకర్ పద్మారావు… యాదాద్రి లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకుని ఆలయం ప్రారంభమైన గంటల్లోనే… కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించారు. ఆ ఆలయ ప్రారంభోత్సవం అయిన వెంటనే… కేసీఆర్… కుమారుడికి పదవి అప్పగిస్తారని ఆయన తేల్చారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ ఎప్పుడు నిర్వహిస్తారో.. అప్పుడే రాజకీయంగా కూడా కీలక మార్పులుంటాయని.. ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే యాదాద్రి ఆలయప్రారంభోత్సవంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.