తెలంగాణ ప్రభుత్వం వద్దని చెప్పినా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అది వేరే పంచాయతీ. కానీ అలా దిగువకు వస్తున్న నీళ్లన్నింటినీ ఏపీ సర్కార్.. ప్రకాశం బ్యారేజీ గుండా సముద్రంలోకి పంపేస్తోంది. ఇక్కడే చాలా మందికి ఓ సందేహం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆపలేనప్పుడు.. అలా వచ్చిన నీటినైనా రైతులకు పంపిణీ చేయకుండా ముద్రం పాలు ఎందుకు చేస్తున్నారన్నదే ఆ సందేహం. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో నారు మళ్ల సీజన్. తూర్పు, పశ్చిమ కాలువ కింద ఉన్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి నీరు విడుదల చేస్తే నారుమళ్లు రెడీ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం అసలాంటి ఆలోచన చేయకుండా నేరుగా సముద్రంలోకి వదిలేస్తోంది.
ప్రకాశం బ్యారేజీ నుంచి రోజుకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ప్రభుత్వం తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఈ పాటికి పట్టిసీమ ద్వారా నీరువచ్చి ఉండేది. ఆ నీటితో నారుమళ్లు పోసుకునేవారు. ఈసారి పట్టిసీమ నీరు రాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూండటంతో దిగువకు నీరు వస్తోంది. వాటినైనా ఇస్తే రైతులు వరి నాట్లు వేసుకుంటారు. కానీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదు. దీనికి కారణం.. రేపు కృష్ణా ట్రిబ్యూనల్లో…తాము విద్యుత్ ఉత్పత్తి చేసినా నీరు ఏపీకే వెళ్లిందని..వారు కాల్వలకు మళ్లించుకున్నారని తెలంగాణ సర్కార్ వాదిస్తుందనే అంచనాతో… తెలంగాణ సర్కార్ నీటిని వృధా చేసిందని చెప్పడానికే.. సముద్రంలోకి పంపుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.
అయితే సముద్రంలోకి పోయే నీరు రైతులకు ఉపయోగపడినంత మాత్రాన.. తెలంగాణ వాడినట్లు ఎందుకు అవదని.. ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించే ప్రయత్నం చేయాలి కానీ.. నీటిని సముద్రంలోకి వదిలేయడం ఏమిటని రైతులు అంటున్నారు. రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతూండటంతో ప్రభుత్వం కూడా.. సముద్రంలోకి పంపే బదులు కాల్వల్లోకి మళ్లించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే.. రైతులకు అంత మేలు.. లేకపోతే.. ఇబ్బందే.