నాలుగో రోజు ఆట ముగిసే సరికే భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ నీరసం వచ్చేసింది. అంతా అయిపోయింది. ఇంకేం అంశల్లేవుకున్నారు. ఐదో రోజు ఆట ప్రారఁభమైన వెంటనే కాసేపటికి పంత్ కూడా ఔటవడంతో ఇక అద్భుతం జరిగితే తప్ప ఇండియా బయట పడటం కష్టమనుకున్నారు. అలాంటి అద్భుతాలు ఎప్పుడో కానీ జరగవు. కానీ లార్డ్స్‌లో జరిగింది. బౌలర్లు షమీ, బుమ్రా బ్యాట్‌ను ఆయస్కాంతంలా పట్టేసుకుని క్రీజ్‌లో నిలదొక్కుకుపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఔట్ చేయడంలో విఫలమయ్యారు. వారి 89 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్ స్కోర్‌ను కమాండింగ్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. చివరికి గెలుపు కోసం డిక్లేర్ చేయగలిగే ధైర్యాన్ని కూడా ఇచ్చింది.
60 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు షమీ, బుమ్రాలే అలవోకగా ఆడారు.. ఇక సొంత గడ్డపై తాము ఎందుకు విజృంభించలేమని అనుకున్నారేమో కానీ ఓ రకమైన నిర్లక్ష్యమైన ఆటతీరును ప్రదర్శించారు. అలాంటి నిర్లక్ష్యం కించిత్ కనిపిస్తే చాలు తాము తమ పని చేసుకుపోతామని భారత బౌలర్లు పంజా విసిరారు. హైదరాబాద్ సిరాజ్ … ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఓ వైపు పరుగులు రాకపోగా.. మరో వైపు వికెట్లు టపాటపా పడిపోయాయి. జోయ్ రూట్ మాత్రమే కాస్త నిలబడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా 33 పరుగలు మాత్రమే చేయగలిగారు. చివరికి ఇంకా తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే 120 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇది నిజమా అని భారత క్రికెట్ అభిమానులు నమ్మలేనంత గొప్ప .. అద్భుత విజయం లార్డ్స్‌లో టీమిండియా పరం అయింది.
క్రికెట్ మక్కాగా ప్రసద్ధి పొందిన లార్డ్స్‌లో భారత్‌కు చిరస్మరణీయమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మొదటి సారి భారత్ వన్డే ప్రపంచకప్‌ను లార్డ్స్‌లోనే ముద్దాడింది. ఇప్పుడు ఆ స్థాయిది కాకపోయినా టెస్ట్ క్రికెట్లో రొమాంచితమైన విజయాన్ని భారత్ అక్కడే అందుకుంది. సిరీస్‌లో మొదటి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో భారత్ గెలవడంతో.. సీరిస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలోఉంది, ఇంకా మూడు టెస్టులు జరగాల్సి ఉన్నాయి.