చైతన్య : ఎన్‌కౌంటర్ డిమాండ్లు ఇప్పుడు వినిపించవేంటి?

” అదే ఆ కేసులో కాస్త పలుకుబడి ఉన్న వాళ్లు ఉన్నట్లయితే.. అలా ఎన్ కౌంటర్ చేయగలిగేవారా ?”.. దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కొన్నివర్గాల నుంచి వచ్చిన ప్రశ్న అది. దిశకు జరిగిన అన్యాయంపై జరిగిన విస్తృత ప్రచారంతో .. సోషల్ మీడియా క్యాంపైన్‌తో భావోద్వేగంలో ఉన్న ప్రజలు ఇన్‌స్టంట్ న్యాయం కోరుకున్నారు. కానీ ఆ నిందితుల్లో పలుకుబడి ఉన్న వాళ్లు ఉంటే…ఆ ఎన్ కౌంటర్ జరిగి ఉండేదా ? అని ఆలోచిస్తే .. చాన్సే లేదని వంద శాతం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కళ్ల ముందే ఎన్నో నేరాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ ఒక్క దాంట్లోనూ ఎవరికైనా శిక్ష పడటం చూశామా ? సంచలనం అయితే తప్ప కేసులు నమోదు కావడం చూశామా ?. దానికి తాజా ఉదాహరణ.. జూబ్లీహిల్స్ మైనర్ రేప్.

మైనర్‌పై సామూహిత అత్యాచారం జరిగితే అదా స్పందన !

28వ తేదీన పబ్‌ నుంచి ఓ పిల్లను తీసుకెళ్లి నడుస్తున్న కారులోనే.. ఏదో బేకరి పార్కింగ్‌లోనే చేయాలనుకున్న పనిని పూర్తి చేశారు. ఆ పిల్ల నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక ఉండిపోయింది. విషయం తెలుసుకుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అందులో ఉన్న నిందితులెవరో తెలుసుకున్న తరవాత పోలీసులు సైలెంటయిపోయారు. మీడియాలో వచ్చి హడావుడి జరిగితే తప్ప ముందుకు కదల్లేదు. చివరికి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే కుమారుడు ఇలా ప్రముఖులందరి పేర్లూ బయటకు వచ్చాయి. కానీ ప్రజల్లో ఎన్నో సందేహాలు… నిజం కొంత మందికే తెలుసు. కానీ ప్రజలకు మాత్రం ఎన్నో సందేహాలు. అంతే కాదు ఆవేదన. ఆ పాపకు జరిగిన అన్యాయంపై … చట్టాన్ని రక్షించాల్సిన వారు తీసుకుంటున్న చర్యలేంటి ? ఎందుకిలా వ్యవహరిస్తున్నారు ?

ఇదే మొదటి సారా ? చరిత్ర మొత్తం అంతే !

ఏపీలో ఓ ఎమ్మెల్సీ నేరుగా ఓ వ్యక్తిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే.. ఐదు రోజుల పాటు నాన్చి నాన్చి.. పెద్దగా నొప్పి తెలియకుండా అతి కష్టం మీద కేసు పెట్టామనిపించారు పోలీసులు. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు.. అప్పుడూ ఇప్పుడు అనే కాలం గురించి చర్చిచాల్సిన అవసరం లేదు.. చట్టం ఎప్పుడూ పలుకుబడి ఉన్న వాళ్ల చేతిలో చుట్టమే అవుతోంది. ఎక్కడిదాకో ఎందుకు.. ఇటీవల ఓ పబ్‌లో డ్రగ్స్ పట్టుకున్నారని హడావుడి చేశారు. అర్థరాత్రి 150 మందిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. డ్రగ్స్ దొరికాయని కొన్ని దృశ్యాలు మీడియాకు విడుదల చేశారు. అలా దొరికిన వారిలో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉన్నారు. కానీ చివరికి కేసు ఏమయింది. ..? తర్వాత మొత్తం తేలిపోయింది. నలుగురిపై కేసు పెట్టి ఇద్దర్ని అరెస్ట్ చేసి.. వారిని కస్టడీకి తీసుకుని.. కస్టడీ రిపోర్టులో అసలు డ్రగ్స్ ఆనవాళ్లే లేవని కోర్టుకు చెప్పారు. దీంతో కేసు తేలిపోయినట్లయింది. అయితే ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారని.. వారిని రక్షించేందుకు అసలు డ్రగ్స్ లేవన్నట్లుగా చెబుతున్నారని ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా ?

సంచలనం అయితేనే కేసు.. బయటకు రాని ఆకృత్యాలెన్నో !

ప్రజా ప్రతినిధులు.. అధికారంలో ఉన్న వారు కుటుంబీకులు.. పిల్లలు.. చేస్తున్న నేరాల గురించి బయట కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ అవన్నీ రూమర్సే. ఎందుకంటే కేసుల వరకూ రావు. వచ్చినా పోలీసులు రాజీ చేసేస్తూంటారు. ఇక తప్పని సరిగా కేసు నమోదు చేయాల్సి వచ్చేది ఎప్పుడంటే.. సంచలనం అయినప్పుడే. అయినా అప్పుడైనా తూ.. తూ మంత్రంగా కేసులు పెడతారు. అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. కానీ కేసులు మాత్రం తేలవు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధుల్లో కేసులు లేని వారు ఎవరైనా ఉంటే వారి వైపు విచిత్రంగా చూడాల్సిన పరిస్థితి. చిన్న చిన్న నేరాలు చేస్తే దొంగలుగా చూస్తున్నారు పెద్ద పెద్ద నేరాలు చేస్తే.. హీరోలుగా చూసే పరిస్థితి వచ్చేసింది. మరి వారి పెంపకంలో పెరిగిన వారు.. వారి అడుగుజాడల్లో నడిచిన వారు అలాగే తయారవ్వక.. మహాత్ముని బాటలో నడుస్తారా ?

చట్టం సమానంగా అందరికీ వర్తించినప్పుడే ప్రజలకు భరోసా !

రాజకీయం ఇప్పుడు అంతా నేరగాళ్ల మయం. ఇప్పుడు ఆ రాజకీయం నుంచి నేరగాళ్లను వేరు చేస్తానని సుప్రీంకోర్టు కంకణం కట్టుకుంటే.. ఆ వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే కొన్ని అంశాల్లో… వ్యతిరేక తీర్పులు చెప్పినందుకే న్యాయవ్యవస్థ విశ్వసనీయతపైనే గురి పెట్టిన ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇక పోలీసులు ఎంత. అధికారంలో ఉన్న వారు అనుగ్రహిస్తేనే పోస్టింగ్‌లు… మరి వారు చెప్పినట్లు చేయకుండా ఉంటారా ? తమకు పోస్టింగ్‌లు ఇచ్చే వారి పిల్లలు నేరాలు చేస్తే కేసులు పెట్టగలరా ? అంటే అన్ని వ్యవస్థలు పూర్తిగా నేరగాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయన్నమాట. ఇంత కన్నా పతనం ఇంకెక్కడా ఉండదు. ప్రస్తుతం ఇదే ప్రమాదం కనిపిస్తోంది. ధర్మాన్ని కాపాడితే.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వ్యవస్థలు. ఏ వ్యవస్థల్ని నాశనం చేస్తారో అదే వ్యవస్థలు తర్వాత వెంటపడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close