బుర్రా సాయిమాధవ్… టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ రైటర్. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మాటల రచయిత కూడా బుర్రానే. ఇప్పుడు సెట్ మీదున్న దాదాపు ప్రతీ పెద్ద సినిమా.. బుర్రా చేతుల్లోనే ఉంది. ఇంకొంతకాలం ఈ స్టార్ డమ్ కి తిరుగులేదు. అయితే.. సడన్‌గా బుర్రాపై టీడీపీ ముద్ర పడిపోయింది. తను నందమూరి రైటర్… అంటూ కొంతమంది అడ్డంగా వాదించడం మొదలెట్టారు. దానికీ ఓ కారణం ఉంది. ఈమధ్య నందమూరి బాలకృష్ణకు ఆయన చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నారు. ఈ యేడాది పొడవునా.. ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని నిర్విరామంగా జరపాలన్నది బుర్రా ఆలోచన. అందుకే ఈ ‘టీడీపీ’ ముద్ర.
నిజానికి.. బుర్రా టీడీపీకి కాదు. పెద్ద ఎన్టీఆర్‌కి భక్తుడు. ఈ విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమాభిమానాలోనే తెనాలిలో ఎన్టీఆర్ ఉత్సవాల్ని పండగలా నిర్వహిస్తున్నారాయన. ఓ స్టార్ రైటర్‌గా ఏమాత్రం ఖాళీ లేని పరిస్థితుల్లో కూడా.. నిత్యం తెనాలిలోనే ఉంటూ, ఆ ఉత్సావాల బాధ్యత తీసుకొన్నారు. ఇది టీడీపీపై ఉన్న ప్రేమ కాదు. కేవలం ఎన్టీఆర్ పై ఉన్న భక్తితోనే. పైగా.. నందమూరి బాలకృష్ణతో ఆయన చేసిన సినిమాలెన్ని? మూడంటే మూడు. ఆ మాటకొస్తే.. మెగా ఫ్యామిలీలోనే బుర్రా ఎక్కువ సినిమాలు చేశారు. కంచె, ఖైదీ నెంబర్ 150, గోపాల – గోపాల, సైరా, ఆర్.ఆర్.ఆర్… ఈ సినిమాలన్నింటికీ.. బుర్రానే రైటర్. నాగబాబు అంటే బుర్రాకి చాలా అభిమానం. టీవీ సీరియల్స్ రాసుకుంటున్న దశలో.. బుర్రాని గుర్తించి, క్రిష్‌కి పరిచయం చేసి, సినిమాల్లోకి అడుగుపెట్టేలా చేసిన వ్యక్తి నాగబాబు. అప్పటి నుంచీ ఆ కుటుంబంతో మెగా బాండింగ్ బలపడింది.
అయితే ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడన్న కారణంతో.. బుర్రా సాయిమాధవ్‌ని టీడీపీ వ్యక్తిగా మార్చేయడం ఎంతమేర సబబు? ఏనాడూ టీడీపీకి అనుకూలంగా గానీ, వైకాపాకి వ్యతిరేకంగా గానీ మాట్లాడని వ్యక్తిని పట్టుకొని టీడీపీ ముద్ర వేస్తే ఎలా? ఎప్పుడూ ఎలాంటి పొలిటికల్ కామెంట్లు చేయని రచయితని పట్టుకొని రాజకీయం పులిమేస్తానంటే ఎలా? ఆయన ఓ ప్రతిభావంతమైన రచయిత. ఆయన్ని అలానే చూడాలి. కళకు, ప్రతిభకు రాజకీయ రంగులు పులమడం ఎందుకు?