పవన్ , చంద్రబాబు ఎలా దగ్గరయ్యారు..? గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిసి పోటీ చేద్దాం రండి అని స్వయంగా పిలిచారు.కానీ పవన్ తన బలమేంటో తేల్చుకుంటానని.. ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన టీడీపీ వైపు రాలేదు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో తనకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని.. వారిని వదిలేసి.. ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఆయనకు అసలు టీడీపీతో కలసి నడవాలనే ఆలోచనే లేదని తేలిపోయింది.కానీ ఇప్పుడు మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.
పవన్ కల్యాణ్ ఆలోచనల్లో మార్పు రావడానికి ప్రధాన కారణం జగన్ రెడ్డి. అధికారం ఉందనే అహంకారంతో… వేధింపులకు పాల్పడటం తో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న అభిప్రాయానికి రావడంతో ఇక ఈ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఏపీలో ప్రజలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. కేసులన్నీ రాజకీయ పరమైనవే. చివరికి పవన్ కల్యాణ్ ను కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ సినిమాలనూ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. మొత్తం సినీ రంగాన్ని టార్గెట్ చేశారు.
అదే్ సమయంలో సినీ ఇండస్ట్రీ చర్చల పేరుతో పిలిచి జగన్ చిరంజీవితో దండం పెట్టించుకోవడం ..దారుణంగా వ్యహరించడం.. ఆ వీడియోలను లీక్ చేయించుకోవడం.. వంటివి పవన్ కల్యాణ్ సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బతీశాయి. జగన్‌కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. అది జరగాలంటే ఓట్లు చీలకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్నుంచి ఒకే మాట మీద ఉన్నారు. వ్యూహాత్మకంగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు పవన్ – చంద్రబాబు కలిశారంటే.. ఆ క్రెడిట్ జగన్ రెడ్డికి.. ఆయన పాలనా అహంకారానికి.. కక్ష సాధింపుల నైజానికి చెందుతుందని.. టీడీపీ, జనసేన వర్గాలంటున్నాయి.