ఓ ఫైనాన్షియల్ సంస్థ ఏదైనా చిన్న సమస్యలో పడిందంటే ఖాతాదారులు పరుగులు పెడతారు. తమ డబ్బు తమకివ్వమని క్యూలో నిల్చుంటారు. ఎందుకంటే ఆర్థిక సంస్థలు ఏదైనా ప్రమాదంలో పడితే తమ డబ్బులు ఇరుక్కుపోతాయేమోనని వారు ఆందోళన చెందుతారు. అగ్రిగోల్డ్ దగ్గర్నుంచి ఎన్నో చేదు అనుభవాలు వారికి ఉన్నాయి. అందుకే మార్గదర్శిని కూడా కుప్పకూల్చలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.
ముందుగా సీఐడీ కేసులు పెట్టించింది. తర్వాత బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయించింది. డబ్బులు తరలించారని ఆరోపించింది. చివరికి రామోజీరావు అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని కూడా బయటకు వెల్లడించింది. అదే సమయంలో ఖాతాదారుల లిస్ట్ తీసుకుని సీఐడీ అధికారులు ఓ కాల్ సెంటరే ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్లు చేసి.. మీ చిట్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పటి వరకూ కట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్క ఖాతాదారుడు కూడా తాము మార్గదర్శితో బంధం తెంచుకుంటామని రాలేదు. అదే సమయంలో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు.
నిజానికి ఓ చిట్ ఫండ్ కంపెనీపై ఇంత నమ్మకం ఉండటం అసాధారణ విషయం. మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీలు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటాయి. కానీ మార్గదర్శి మాత్రం అన్ని డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత వారం పది రోజుల్లో చెక్కు ఇచ్చేస్తుంది. అదే ఏ డాక్యుమెంట్లు అవసరం లేకపోతే.. ఎల్ఐసీ డబ్బులు జమ చేసినట్లుగా చేసేస్తుంది. ఎంత నమ్మకం ఉంటే… ఆర్థిక సంస్థపై ప్రజలు ఈ మాత్రం నమ్మకం పెట్టుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరు కూడా మార్గదర్శిలో ఉన్న తమ సొమ్ములు తీసుకోవడానికి రాకపోవడంతో… చివరికి ఉండవల్లిని దింపి ఖాతాదారుల లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేయించారు. అది ఇప్పటికే సీఐడీ పోలీసుల చేతుల్లో ఉంది. కానీ అదో ఆనందం.
ఓ దశలో సీఐడీ అధికారులు మార్గదర్శిని మూసేస్తామని కూడా హెచ్చరించారు. ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నా మార్గదర్శికి ఖాతాదారులు అండగా ఉన్నారు. వారి నమ్మకం.. అధికారంలో ఉన్న పెద్దల కక్ష కన్నా ఎన్నో రెట్లు బలమైనది. ఆ విషయం స్పష్టమయింది.