ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అసహనంతో రగిలిపోతున్నారు. దశాబ్దాల పాటు రాజకీయంలో ఉన్న వీరు ఇప్పుడుతమ కోపాన్ని అసహనాన్ని అణుచుకోలేకపోతున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో పార్టీ నేతల్ని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బొత్స ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఈ సారి మాత్రం ‘అసలేంటి.. నీ బాధ.. బాధలు నీకేనా మాకు ఉండవా..? అంటూ ఫైరయ్యారు. అంటే బొత్స కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అర్థం.
మరో మంత్రి ధర్మాన మరింత అసహనంగా ఉంటున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతుందో లేదోనని వైసీపీ నేతలు కూడా గొణుక్కుంటున్నారు. వైసీపీకి ఎవరూ ఓటేయడం లేదని ఆయన నేరుగానే చెబుతున్నారు. ఓటేయాల్సిందేనన్నట్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏమీ వర్కవుట్ కాకపోవడంతో ఆయన నిరాశకు గురవుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్య మంత్రి అమరావతిలో సమావేశాలు నిర్వహిస్తే వరుసగా మూడు సమా వేశాలకు ధర్మాన గైర్హాజరయ్యారు. ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్ర మాన్ని ధర్మాన ప్రసాదరావు నిరవహించడం లేదు. పార్టీ నేతలకు కూడా పెద్దగా ఏం చెప్పలేదు.
ఈ ఇద్దరు సీనియర్ మంత్రులు అసహనానికి కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బొత్స, ధర్మానలకు వారి జిల్లాల్లో మంచి పలుకుబడి ుంది. జిల్లా రాజకీయాల్లో పెద్ద తలకాయలు. వారిని కాదని ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ నుంచి ఈ పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలోనూ ఆ హవా నడిచింది. కానీ, ఇటీవల పరిస్థితిలో మార్పు వచ్చింది. సొంత పార్టీలోనే వారి మాట చెల్లుబాటు కావడం లేదని సమాచారం. ఎమ్మెల్యేలు సైతం వారి మాట వినడం లేదు.
ఓ వైపు సీఎం జగన్ వ్యూహాత్మకంగా తమను బ్యాడ్ చేస్తున్నారన్న ఆందోళన.. చివరికి టిక్కెట్ కూడా ఇవ్వబోమన్న ప్రచారాలు వారిని అసహనానికి గురి చేస్తున్నాయి. దాన్ని ప్రజలపై చూపించి చులకన అయిపోతున్నారు. ఉత్తారంధ్ర సీనియర్లకు జగన్ రాజకీయాలు ఇంకా అర్థం కాలేదని విజయనగరం, సిక్కోలుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.