కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశం అయింది. గొడవపడ్డ వారిలో ఓ మహిళ భర్త ఎస్ఐ అయితే మరొకరు ముస్లిం మహిళ. ఆ గొడవలో ఎస్ఐ జోక్యం చేసుకోవడంతో అసలు కథ ప్రారంభమయింది. ఈ వివాదంలో చివరకు ఓ ఎస్సై సస్పెండ్ అవ్వడం, ఆయన భార్యపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తన భార్యతో గొడవ పడిన మైనార్టీ యువతిపై ఎస్సై దాడికి పాల్పడ్డాడని, ఆమెను జుట్టు పట్టుకుని బస్సు నుంచి కిందకు లాక్కొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్సైను సస్పెండ చేశారు.
అయితే సస్పెండ్‌కు గురైన ఎస్సై అనిల్ భార్య సంధ్య వాదన మాత్రం మరోలా ఉంది. మైనార్టీ యువతినే తనను నోటికొచ్చినట్లు తిట్టడంతో పాటు కొట్టారని, తన భర్త ఆమెను కొట్టలేదని చెబుతోంది. జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేసిన వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఒత్తిడితో ఈ పని చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన అని అన్నారు. దీనికి వ్యతిరేకంగా శనివారం జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చారు.
అయితే ఎస్ఐ మాత్రం .. తన సస్పెన్షన్ గురించి పూర్తిగా డిపార్టుమెంట్ అంశమని.. ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధమేమిటని అంటున్నారు. తనను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన అంటున్నారు. అయితే బీజేపీ ఇక్కడ బాధితులు.. నిందితులు చూడటం లేదు. అక్కడ జరిగిన గొడవలు హిందువులు, ముస్లింలు ఉన్నారని చూస్తోంది. అందుకే కావాల్సిన రాజకీయం చేసేస్తున్నారు.