జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి ఇంకా దిగలేదు. తెలంగాణ బీజేపీ నేతలతో పోలిస్తే… పవన్ కల్యాణ్ ఎక్కువ మంది జనాల్ని ఆకర్షిస్తారు. ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా బహిరంగసభలు పెట్టలేకపోతున్నారు. దీనికి కారణం జన సమీకరణ సమస్యే. అదే పవన్ కల్యాణ్ సభకు వస్తారని చెబితే… జనసమీకరణ సమస్య కాదు. అయినా పవన్ తో ప్రచారం విషయంలో ఇంకా బీజేపీ సంప్రదింపులు ప్రారంభించలేదు.
బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేస్తోంది. అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నరు. గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి సీటును మాత్రమే కేటాయించారు. ఆయా సీట్లలో అయినా పవన్ తమ పార్టీకి ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తూ.. అభ్యర్థులకు ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పవన్ ఖచ్చితంగా ప్రచారం చేస్తారని అంటున్నారు.
పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ తమకూ ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు కోరుకుంటారు. ముఖ్యంగా గ్రేటర్ లో తమకు పవన్ ప్రచారం చేయాలని అభ్యర్థులు అందరూ విజ్ఞప్తి చేస్తారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. తెలంగాణలో ఇక ముందు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు. ఈ సభల్లో పవన్ పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. . జనసేన నేతలు పోటీ చేస్తున్న ఎనిమిది నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో బీజేపీ నేతల నుంచి పెద్దగా సహకారం లేదు. కానీ బీజేపీ అగ్రనేతలు జనసేన అభ్యర్థుల కోసం కూడా పని చేస్తారని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది.
అయితే పవన్ తో విస్తృతంగా ప్రచారం చేయించుకుంటే… కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తారన్న భావనతో … వీలైనంత తక్కువగా పవన్ ప్రజెన్స్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారని చెబుతున్నారు. చివరి రెండు, మూడు రోజుల్లో గ్రేటర్ లో పవన్ రోడ్ షోలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టత రావాల్సి ఉంది.