సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్ చేసి.. రిజర్వేషన్ల రద్దుపై తప్పుడు ప్రచారం చేసిందని ఢిల్లీలో కేసు నమోదయింది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కూడా పీసీసీ అధ్యక్షునిహోదాలో నోటీసులు ఇచ్చారు. ఆయన తనకు నాలుగువారాల సమయం కావాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. అదే సమయంలో అదే ఫేక్ పోస్టులు పెట్టి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ ను అరెస్టు చేశారు.
ఉస్మానియా హాస్టల్స్ లో నీరు, కరెంట్ లేదని సెలవులు ఇస్తున్నట్లుగా వార్డెన్ పేరుతో ఓ సర్క్యూలర్ వైరల్ అయింది. దాన్ని క్రిషాంకే పోస్ట్ చేశారు. అది ఫేక్ అని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సర్క్యూలర్ పై దుమారం రేగింది. కేసీఆర్ కూడా ట్వీట్ చేశారు. తర్వాత రేవంత్ కూడా కౌంటర్ కూడా ఇచ్చారు. గోబెల్స్ మళ్లీ పుట్టినట్లగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ సర్క్యులర్ పోస్టు చేశారు. ఈ దుమారం రేగుతండగానే.. కొత్త గూడెం నుంచి వస్తున్న క్రిషాంక్ ను చౌటుప్పల్ వద్ద అదుపులోకి తీసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై ఎలాంటి కేసులు పెడతారో కానీ… ఈ అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వియ్ స్టాండ్ విత్ క్రిషాంక్ పేరుతో ప్రచారం ప్రారంభించింది.
సోషల్ మీడియా స్వేచ్చను రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నాయి. ఎంత ఫేక్ చేస్తే..అంత గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అది నిజం కాదని తెలిసినా అమాయకులైన వారు నమ్మేస్తారని కాంగ్రెస్ పై లేదా.. బీఆర్ఎస్ పై లేదా బీజేపీపై ద్వేషం పెంచుకుంటారని భావిస్తున్నారు. ఫలితంగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా సోషల్ మీడియా విభాగాలు మారిపోయాయి. రాను రాను ఇది వికృత రూపం దాలుస్తోంది.