రాజ్యసభకి నాల్గవ అభ్యర్ధిని కూడా నిలబెట్టాలనుకొంటున్నట్లు తెదేపా చెప్పినప్పుడు వైకాపా నేతలు అన్యాయం, అక్రమం అని గగ్గోలుపెట్టేరు. తెదేపాకి నాల్గవ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు, వైకాపా ఎమ్మెల్యేలనే ప్రలోభపెట్టి గెలిపించుకోవలసి ఉంటుంది కనుక వైకాపా అభ్యంతరాలు చెప్పడం సహజమే. కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళే నాల్గవ అభ్యర్ధిని నిలబెట్టలేకపోయినందుకు తెదేపాను ఎద్దేవా చేస్తుండటం విచిత్రంగా ఉంది. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా నాల్గవ అభ్యర్ధిని నిలబెట్టలేకపోవడం చంద్రబాబు నాయుడి తోలి ఓటమిగా మేము భావిస్తున్నాము. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్ లో దాని ఓటమికి ఇదే ప్రారంభ సూచిక. మా అభ్యర్ధి విజయసాయి రెడ్డిని ఓడించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా, అన్ని పనులను మానుకొని మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగినా నేటికీ మా పార్టీ బలంగానే ఉంది. తెదేపా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని పోరాడుతూనే ఉంది. ఉంటుంది,” అని కోటం రెడ్డి అన్నారు.
నాల్గవ అభ్యర్ధి విషయంలో వైకాపా ఈవిధంగా రెండు విధాలుగా మాట్లాడటం విచిత్రంగానే ఉన్నప్పటికీ, దానికి ఆ అవకాశం కల్పించింది తెదేపాయేనని చెప్పకతప్పదు. అది అటువంటి ఆలోచన చేయకుంటే, ఇటువంటి విమర్శలు వినవలసిన అవసరమే ఉండేదే కాదు కదా! తెదేపా ఏ ఉద్దేశ్యంతో అటువంటి ఆలోచన చేసిందో కానీ దానివలన ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలు హుందాగా, ఆదర్శవంతంగా మెలగాలి. అప్పుడే వాటికి ప్రజలు కూడా గౌరవిస్తారు.