సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి రేపటికి రెండు సంవత్సరాలవుతుంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అనేక దశాబ్దాలుగా పోరాడి చివరికి సాధించుకొన్నారు కనుక తెలంగాణా ప్రభుత్వం, ప్రజలకి రేపు చాలా సంతోషకరమైన దినమే. అందుకే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంబరాలు జరుపుకోబోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అందుకు పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి ఉంది. ఉంది అనేకంటే రాష్ట్ర ప్రభుత్వమే అటువంటి పరిస్థితి సృష్టించిందని చెప్పక తప్పదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ వాస్తవాన్ని జీర్ణించుకొని ధైర్యంగా ముందుకు సాగకతప్పదు. అదే విజ్ఞుల లక్షణం. కానీ రెండేళ్ళయినా ఇంకా విభజన వలన జరిగిన నష్టాన్ని పదేపదే తలుచుకొంటూ, దాని గురించే పదేపదే మాట్లాడుకొంటూ, ఓదార్చుకొంటూ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకో(లే)కపోవడం ఇంకా బాధాకరం.
మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి రెండేళ్ళ క్రితం వరకు ప్రతీ ఏటా ఊరూరా నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని చాలా ముచ్చటగా జరుపుకొనే వాళ్ళం. కానీ విభజనని నిరసిస్తూ ఆ ప్రజాపండుగని గత రెండేళ్లుగా చేసుకోకుండా మానేయడం చాలా దురదృష్టకరం. రాష్ట్రావతరణ దినోత్సవానికి బదులు రేపటి నుండి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచడానికే నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెపుతున్నారు.
అయితే ఆత్మవిశ్వాసం పెరగవలసింది ప్రజలలో కాదు ముందు ప్రభుత్వంలో పెరగాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది. కానీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. కేంద్రం సహాయం కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉంది. కేంద్రం సహాయం కోరుతూ ముఖ్యమంత్రి డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం కనబడటం లేదని కేంద్రాన్ని నిందిస్తూనే ఉన్నారు. కానీ ఈ రెండేళ్లలో వివిధ పధకాలు, అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం చెపుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను గమనిస్తే అది నిజమని అర్ధమవుతుంది. మరి కేంద్రాన్ని, విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ఎంత కాలం నవనిర్మాణ దీక్షలు చేసుకోవాలి?అసలు వాటి వలన ప్రయోజనం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకొనే హక్కు, భాగ్యం లేదా?
అయినా తెదేపా ప్రభుత్వానికి మంచిగా అనిపించింది రేపు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానికి తప్పుగా అనిపించవచ్చు. అప్పుడు ఈ నవనిర్మాణ దీక్షలు పక్కన పడేసి, మళ్ళీ రాష్ట్రావతరణ దినోత్సవం చేసుకోవాలని ఆదేశించవచ్చు. అంటే ప్రజలకు, రాష్ట్రానికి సంబంధిన ఈ విషయంపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు బలవంతంగా రుద్దుతున్నట్లే కదా? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గురించి ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకి, మేధావులకి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ అంతమాత్రన్న ఆ ప్రజాపండుగని ఏకపక్షంగా ప్రభుత్వం రద్దు చేయడం సబబు కాదు. కనుక ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులతో చర్చించి రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలో నిర్ణయించుకొంటే మంచిది.