వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర చేపట్టారు.
ఆయన ఏ కార్యక్రమం పెట్టుకొన్నప్పటికీ దాని అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడుని విమర్శించడమేనని ఇవ్వాళ్ళ మరోమారు నిరూపించుకొన్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను ఓదార్చి వారికి నేనున్నాననే భరోసా కల్పించడం ఆయన ‘రైతు భరోసా యాత్ర’ ముఖ్య ఉద్దేశ్యం. ఆయన ఆ కుటుంబాలను ఓదార్చారు బాగానే ఉంది కానీ ఆ తరువాత మళ్ళీ యధాప్రకారం చంద్రబాబు నాయుడుని విమర్శించడానికే ఆయన పూర్తి సమయం వెచ్చించారు.
మహానాడు సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ జగన్మోహన్ రెడ్డి నామస్మరణతోనే తరించిపోయారని వైకాపా నేతలు ఎద్దేవా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాత్రి పగలు, ఎండావాన అని చూడకుండా నిత్యం చంద్రబాబు నాయుడు నామస్మరణలోనే గడిపేస్తున్నారు. ఒక సినిమాని పదిసార్లు చూసినవారు ఏవిధంగా ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ముందే చెప్పగలుగుతారో అదేవిధంగా జగన్ ఏ సందర్భంలో ఏమి మాట్లాడుతారో అందరూ ఊహించి చెప్పగలరు. పైగా ఆయన సబ్జక్ట్ చంద్రబాబు నాయుడు చుట్టూనే అల్లుకొని ఉండటం చేత, ప్రజలకు కొత్తగా చెప్పేందుకు ఏమీ ఉండదు.
జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళ అనంతపురం జిల్లాలో పర్యటించినపుడు కూడా పంటరుణాల మాఫీ చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఒక్కో వైకాపా ఎమ్మెల్యేని రూ. 40 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయనకి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆ తరువాత, అక్కడి రైతుల చేత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడించి తృప్తి పొందారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉన్న మాట నిజమే కానీ జగన్ తను చేస్తున్న రైతు భరోసా యాత్రల వలన కష్టాలలో ఉన్న రైతులకు భరోసా కల్పించే బదులు వారికి ప్రభుత్వంపై ఇంకా అపనమ్మకం ఏర్పడేలా మాట్లాడుతూ వారిలో నిరాశా నిస్పృహలు ఇంకా పెంచుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు రూ.20 కోట్లు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని జగన్ ఇంతకు ముందు ఆరోపించేవారు. ఇవ్వాళ్ళ ఏకంగా రూ.40 కోట్లు ఇస్తున్నారని ఆరోపించడం విశేషం. ఆయన చేతిలో బలమైన మీడియా ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క ఆరోపణని కూడా నిరూపించలేకపోయారు. నిరూపించి చూపి ఉండి ఉంటే అది తెలంగాణాలో ఓటుకి నోటు కేసు కంటే పెద్ద సంచలనం అయ్యుండేది కదా?