ఆంధ్రాలో మిత్రపక్షమైన తెదేపా తరచూ కేంద్రాన్ని విమర్శిస్తుంటే దానితో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక రాష్ట్ర భాజపా నేతలు తికమక పడుతుంటారు. రాష్ట్ర నేతలు తెదేపా నేతలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటే కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, పీయూష్ చౌదరి, సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ తదితరులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెగ పొగిడేస్తుంటారు. భాజపాలో నెలకొన్న అయోమయానికి ఇదే ఒక నిదర్శనం.
తెలంగాణా రాష్ట్రంలో కూడా భాజపా నేతల్లో ఇటువంటి అయోమయమే కనిపిస్తుంది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేరుకి భాజపా నేతే కానీ భాజపా వారితో కంటే తెరాస నేతలతోనే భుజాలు రాసుకొని తిరుగుతుంటారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై నాగం జనార్ధన రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే, దత్తన్న కెసిఆర్ ని పొగుడుతుంటారు. తెలంగాణాలో మజ్లీస్ పార్టీని ఎదుర్కొని నిలబడగలిగేది భాజపా మాత్రమేనని నొక్కి చెప్పే దత్తన్న, రంజాన్ సందర్భంగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి పాల్గొన్నారు.
అక్కడ దత్తన్న కెసిఆర్ తో అంటకాగుతుంటే, భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని తను సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలనని, కనుక తక్షణమే విచారణకి ఆదేశించాలని కెసిఆర్ ని డిమాండ్ చేశారు. ఒకవేళ కెసిఆర్ అందుకు అంగీకరించకపోతే తను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో తనపై విద్యార్ధుల చేత దాడి చేయింది కెసిఆర్ అనే తనకు తెలుసునని నాగం మరో కొత్త ఆరోపణ కూడా చేశారు.
ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వారి ఆరోపణలని అంతే దీటుగా ఖండిస్తోంది తప్ప విచారణకి ఆదేశించలేదు. కనుక నాగం జనార్ధన్ రెడ్డి ఏదో యధాలాపంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని అనుకోవడానికి లేదు. ఒకవైపు కేంద్రమంత్రులు కెసిఆర్ ని పొగుడుతుంటే, ఆయనని కోర్టుకి లాగుతానని నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించడం చూస్తుంటే, తెరాస పట్ల భాజపా అయోమయంలో ఉందని స్పష్టమవుతోంది. రెండు రాష్ట్రాలలో ఈవిధమైన అయోమయంతో సాగుతూ తెదేపా, తెరాసలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా ఏవిధంగా కలలు గంటోందో?