తెలంగాణా న్యాయవాదుల పోరాటం ఉదృతమయ్యింది. చివరికి అది ఇద్దరు న్యాయమూర్తుల (నాంపల్లి 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి కే. రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి వి.వరప్రసాద్) సస్పెన్షన్ కి దారి తీసింది. అందుకు నిరసనగా అన్ని క్యాడర్లకి చెందిన న్యాయాధికారులు నేటి నుంచి మూకుమ్మడిగా శలవులు పెట్టి నిరసనలు తెలియజేయబోతున్నారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు వేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలేని రీకాల్ చేయాలంటూ, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి విజ్ఞప్తి చేసింది. ఆయన తన నిర్ణయాలన్నీ ఉపసంహరించుకోనేంత వరకు ఆయనకి సహకరించకూడదని, ఆయన న్యాయస్థానాన్ని ఉద్యోగులు, న్యాయవాదులు అందరూ బహిష్కరించాలని నిర్ణయించింది.
న్యాయమూర్తులు రోడ్లెక్కి ధర్నాలు చేయవలసిరావడం, అందుకు వారిని ప్రధాన న్యాయమూర్తి సస్పెండ్ చేయడం, అందుకు నిరసనగా ఆయనని రీకాల్ చేయాలని బార్ అసోసియేషన్ కోరడం, ఆయన న్యాయస్థానాన్ని బహిష్కరించడం వంటివన్నీ చాలా అవాంచనీయ పరిణామాలు. మన న్యాయవ్యవస్థలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడటం బహుశః ఎన్నడూ చూసి ఉండము. దీనికంతటికి మూల కారణం రెండేళ్ళు గడిచినా హైకోర్టు విభజన చేయకపోవడమేనని చెప్పక తప్పదు. హైకోర్టు విభజన జరిగి ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యేవే కావు.
హైకోర్టు విభజన కోసం తెలంగాణా ప్రభుత్వం, న్యాయవాదులు చాలా కాలంగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు విభజన జరగాలంటే ఏపిలో తాత్కాలిక భవనంలోనైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వానికి తెదేపా మిత్రపక్షం, ప్రభుత్వంలో భాగస్వామి అయిన కారణం చేత గాబోలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేయలేదు. చేసి ఉండి ఉంటే ఈపాటికి ఏపిలో ఎక్కడో అక్కడ హైకోర్టు ఏర్పడే ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
హైకోర్టు విభజన కోసం తెలంగాణా ప్రభుత్వం పద్ధతి ప్రకారం అధికారికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తెరాస ప్రభుత్వం చేయాలనుకొన్నా చేయలేకపోతున్న దాని కోసమే తెలంగాణా న్యాయవాదులు పోరాడుతున్నారు కనుకనే వారి పోరాటాలని ప్రభుత్వం ఉపేక్షించి ఉండవచ్చు. వారి పోరాటాన్ని అడ్డుకోకుండా దూరంగా ఉంటూ అది ఇంత తీవ్రస్థాయికి చేరుకొనేందుకు తెరాస ప్రభుత్వమే పరోక్షంగా సహకరించిందని భావించవచ్చు. తెరాస ఉద్యమ పార్టీ కనుక ఇటువంటి పద్దతులలో వెళ్లి ఉండవచ్చు. కానీ అందుకు దానిని, న్యాయమూర్తులని కూడా తప్పు పట్టలేము. ఇంతకాలం వారి గోడు పట్టించుకోని కేంద్రాన్నే నిందించక తప్పదు.
ప్రస్తుతం తెలంగాణా న్యాయవ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులు కేంద్రంపై ఒత్తిడి కలిగించడం ఖాయం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేసి వంచాలన్నట్లుగా ఇదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, తన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, తెలంగాణా న్యాయవాదులతో కలిసి డిల్లీలో దీక్ష చేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. అప్పుడు కేంద్రం దిగిరాక తప్పదు. హైకోర్టు విభజనకి వీలుగా చట్టసవరణ అయినా చేయాలి లేకుంటే చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రాలో ఎక్కడో అక్కడ తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేసుకొనేలా చేయవలసి రావచ్చు. ఒకవేళ కెసిఆర్ నిజంగానే డిల్లీలో దీక్ష చేశారంటే, ఇంతకాలం ఆయనే వెనుకుండి న్యాయవాదుల ఉద్యమాన్ని నడిపించినట్లు భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమనుకొంటే, కేసీఆర్ చాలా చక్కటి వ్యూహం అమలు చేసి తన లక్ష్యం నెరవేర్చుకొన్నారని చెప్పకతప్పదు.