కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి కాలాన్ని పొడిగించిన సందర్భాలు లేవు. ద్వారకా తిరుమలరావు పదవి కాలం పొడిగింపునకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారా మరొకరికి చాన్సిస్తారా అన్నది త్వరలో తెలియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు, ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది.నిజానికి ఆయన సీనియార్టీలో టాప్ టెన్ లో లేరు.కానీ జగన్ రెడ్డి మనోజ్ అనుకుని ఆయనకు అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు చాన్సిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగానే ఉన్నారు కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు చాన్సిచ్చారు.
చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారు. సీనియార్టీకి గౌరవం ఇస్తారు. అదేసమయంలో సమర్తత చూస్తారు. సీనియార్టీ ఉన్నా.. అంచనాలకు అనుగుణంగా పని చేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరు. ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్లీ హరీష్ గుప్తాకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరు డీజీపీగా ఉన్నా.. వైసీపీ హాయాంలో సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేస్తున్నారు.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              