సినిమా బిజినెస్ కి ఒక కొత్త మార్గం చూపింది ఓటీటీ. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ బిజినెస్ ఉదృతంగా పెరిగింది. కేవలం ఓటీటీ ని నమ్ముకుని సినిమా తీసిన నిర్మాతలు కూడా ఉన్నారు. ఓటిటిలో బిజనెస్ జరిగితే చాలు పెట్టిన బడ్జెట్ తో గెట్టిక్కేయొచ్చు అనే ప్లాన్ తో తీసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.
కొంతకాలం దాదాపు సినిమాలు ఓటీటీ రూపంలో లాభాలు పొందినవే. అయితే బిజినెస్ మోడల్ ఎప్పుడు ఒకేలా ఉండదు. తొలుత సినిమాల్ని విరివిగా కొన్న ఓటీటీ సంస్థలు ఆ తర్వాత ఎక్కడలేని నియమ నిబంధనలు పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడైతే సినిమా రిలీజ్ డేట్ ని కూడా శాసించే పరిస్థితి నెలకొంది. సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి, ఓటిటి లోకి ఎప్పుడు రావాలి.. ఇవన్నీ కూడా వాటి చేతుల్లోనే వెళ్ళడం మొదలైంది.
అంతేకాదు బిగినింగ్ లో నిర్మాతలకు లాభాలు చూపుతూ మొదలైన ఈ ట్రేడ్ క్రమంగా ఓటీటీలకి అనుకూలంగా మారింది. ఇప్పుడు ఓటీటీ నమ్ముకొని సినిమా చేస్తే దాన్ని కిల్ చేసుకోవడమే అనే పరిస్థితి వచ్చేసింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాని నిర్మించిన సునీల్, అశోక్ ఇదే అంశాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. ఓటీటీ ని నమ్ముకొని సినిమా చేస్తే మునిగిపోయినట్లే. మన కంటెంట్ మీద నమ్మకం వుండాలి. సినిమా అల్టిమేట్ బిజినెస్ థియేటరే కావాలి. ఓటీటీ టైం అయిపొయింది. దాన్ని నమ్ముకొని సినిమా చేయడం ఆపేయాలి. సినిమా అనేది థియేటర్ కే. ఒకప్పుడు శాటిలైట్ ఎలా ఎలా వెలిగి ఆగిపోయిందో ఇప్పుడు ఓటీటీ కూడా అంతే. ఆ సంస్థలు పెట్టే కండీషన్స్ కి లోబడి సినిమాలు రిలీజ్ చేయడం కంటే ఆ ఆప్షన్ ని తీసేయడమే మేలు’అని కాస్త అసహనం వ్యక్తం చేశారు.
నిర్మాతలు చెప్పిన విషయాల్లో కొన్ని వాస్తవాలు వున్నాయి. ఇప్పుడు ఓటీటీలు పెట్టే కండీషన్ కాస్త వింతగానే ఉంటున్నాయి, ముఖ్యంగా చిన్న మీడియం సినిమాలకి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కష్టమైపోతుంది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నిర్మాతలు కూడా ఓటీటీ ఆప్షన్ పై బ్లైండ్ గా నమ్మకం పెట్టుకోవడం లేదు. ప్రేక్షకులుని థియేటర్స్ కి రప్పించే సినిమా తీయడమే అంతిమం. అలాంటి సినిమాలకే అన్ని బిజినెస్ లు సులువుగా జరుగుతాయి.