అప్పులు తీసుకుని ఎగ్గొట్టారని వైసీపీ నేత బుట్టా రేణుకకు చెందిన ఆస్తులు వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అన్ని రకాల చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేసింది. ఇప్పటికే ఓ సారి వేలానికి పిలువగా.. తీసుకున్న అప్పునకు తగ్గట్లుగా బేరం రాలేదు. దాంతో ఎల్ఐసీ మరోసారి వేలానికి ప్రయత్నిస్తోంది.
బుట్టా రేణుకకు.. స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్ షిప్లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి మూడువందల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులు తనఖా పెట్టారు. ఇందులో మాదాపూర్ లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్ తో పాటు.. మరో ఖరీదైన స్థలం ఉంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణం తీసుకుని ఈఎంఐలు కూడా కట్టండి మానేశారు.
వేలంలో ఎవరూ కొనకుండా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొంటే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయన్న బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ రుణం వసూలు చేసుకోవాలని ఎల్ఐసీ పట్టుదలగా ఉంది. ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలని..తమ ఆస్తులు వేలం వేయలేరన్నట్లుగా బుట్టా తీరు ఉందని అంటున్నారు. అయితే ఈ సారి మరింత ప్రచారం కల్పించి.. అమ్మేయాలని ఎల్ఐసీ పట్టుదలగా ఉంది.