దేశ్యాప్తంగా డ్యాముల భద్రతను పరిశీలించి రిపోర్టులు ఇచ్చే అత్యంత నిపుణులు ఉండే సంస్థ NDSA కాళేశ్వరంపై ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ కు కోపం తెప్పించింది. అసలు అది NDSA కాదని ఎన్డీఏ రిపోర్టు అని.. అసలు రిపోర్టు మేము ఇస్తామని ఏకంగా ఓ పుస్తకం ప్రింట్ చేయించేశారు. దానికి కాస్త వెయిట్ ఉండాలంటే.. ఎవరో ఒక సాగునీటి రంగ నిపుణుడ్ని పేరును వాడాలి కాబట్టి.. ఆ పనీ పూర్తి చేశారు. శ్రీధర్ దేశ పాండే అనే పెద్ద మనిషిని తెలంగాణ సాగునీటి రంగ నిపుణులుగా పరిచయం చేస్తూ పుస్తకం ప్రచురించారు.
ఆ పుస్తకం పేరు ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు – విమర్శలు – వక్రీకరణలు – వివరణలు’’. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టుకు పేజ్ టు పేజ్ కౌంటర్ ఇస్తారన్నమాట. సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం అనే మరో పుస్తకాన్ని కూడా రెడీ చేశారు. వీటిని ’ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంల ఈనెల 2వ తేదీన ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథిగా మాజీమంత్రి టి.హరీశ్ రావు హాజరవుతారు. తెలంగాణ సాగునీటిరంగంలో పదేండ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన తప్పనిసరి అవసరం, సందర్భం ఉన్నందునే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ని వాదనలు వినిపించినా కాళేశ్వరం బ్యారేజి కుంగిపోయిందన్నది కళ్ల ముందు ఉన్న నిజం. అక్కడ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకపోయినాపెద్దగా తేడా కనిపించడం లేదు. దాని వల్ల ఉపయోగం ఏమిటన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టుతో లక్ష కోట్లను కేసీఆర్ వృధా చేశారన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. ఇలాంటి పుస్తకాల ద్వారా బీఆర్ఎస్ తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది.