గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి కర్ణన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఆయన ఫుడ్ సేఫ్టీని చూసుకునేవారు. అక్కడ తనదైన ముద్ర వేయడంతో గ్రేటర్ కమిషనర్ గా చాన్స్ వచ్చింది. హైదరాబాద్ హోటళ్లలో ఉండే.. దారుణమైన పరిస్థితుల్ని, హోటళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని, వారి అపరిశుభ్రతను ప్రజల ముందు పెట్టారు.
కర్ణన్ రాష్ట్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, ఆహార భద్రతా శాఖ కమిషనర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్ల్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ హోటళ్లైన ప్యారడైస్ ఫుడ్ కోర్ట్, రామేశ్వరం కేఫ్, కృతుంగ వంటి సంస్థలపై చర్యలు తీసుకున్నారు. హోటళ్లు అన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యేలా చేయడంలో విజయవంతం అయ్యారు. ఆయన పనితీరును హైదరాబాద్ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కర్ణన్ గతంలో కరీంనగర్, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం. కానీ సమస్యలకు కొదవలేదు. రోడ్లను ఆక్రమించేవారు.. అక్రమ నిర్మాణాలు చేసేవారు ఎటు చూసినా ఉంటారు. అయితే ఇలాంటివి చాలా మంది ఆఫీసర్లు చూస్తారు. కానీ కర్ణన్ ప్రజల మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టే అధికారి. గ్రేటర్ పరిధిలో ప్రజల రోడ్లు, నీరు ఇతర సౌకర్యాలతో పాటు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్యలనూ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయనకు ఉన్న సిన్సియారిటీ కారణంగా ఎక్కువగా ఉంది ఈ అంశాలపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.
ప్రస్తుతం కర్ణన్.. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ను సిద్ధం చేసే మిషన్ తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మిస్ వరల్డ్ 2025 ఈవెంట్‌కు సంబంధించిన బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. చారిత్రక ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. గ్రేటర్ ఉన్న ఆర్థిక సమస్యలను అధిగమించి ఆయన.. అద్భుతమైన పనితీరు చూపించి కోటి మంది ప్రజల మౌలిక అవసరాలు తీరుస్తారని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ కనిపిస్తోంది.