సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎన్నో కలలతో సాఫ్ట్ వేర్ రంగంలో ఆశలు నేరవెర్చుకుందామని వచ్చే వారి జీవితాలతో ఓ ఆట ఆడుకుంటోంది. ప్రముఖ కంపెనీ అని.. అన్ని రకాల టస్టుల్లో పాసై ఆ కంపెనీని మెప్పించి ఉద్యోగంలో చేరితే.. ప్రాథమిక దశలోనే కొన్ని టెస్టులు పెట్టి మీరు పనికి రారు అని యాజమాన్యం పంపించి వేస్తోంది. ఈ టెర్మినేషన్ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇతర అవకాశాల్ని వదులకుని మంచి కంపెనీ అని వచ్చిన వారికి నమ్మకద్రోహం చేస్తోంది.
ఇన్ఫోసిస్ 2025లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు 800 మంది ట్రైనీలను ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్‌లలో ఫెయిల్ అయ్యారని చెప్పి టెర్మినేట్ చేసింది. ఫిబ్రవరిలో 400 మంది, మార్చిలో 50 మంది, ఏప్రిల్‌లో 350 మంది ట్రైనీలను తొలగించారు. ఈ ట్రైనీలు సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ రోల్స్‌కు ఎంపికైన వారు. ఇన్ఫోసిస్ తన ట్రైనీలకు ‘జెనెరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’లో మూడు అవకాశాలు ఇస్తుంది. 2024 బ్యాచ్ కోసం అసెస్మెంట్ క్రైటీరియా కఠినతరం చేయడం వల్ల ఫెయిల్యూర్ రేటు గణనీయంగా పెరిగింది. ఇది కావాలని చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసెస్మెంట్ ప్రక్రియలో న్యాయం జరగడం లేదని.. టెస్ట్‌లు ఉద్దేశపూర్వకంగా కష్టతరంగా సెట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా అసలు ఇంటర్యూ ప్రాసెస్‌లోనే చేసి ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత ఇలా చేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సిస్టమ్ ఇంజనీర్లకు, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్లకు ఒకే రకమైన టెస్టు పెడుతున్నారు. టెర్మినేట్ చేసిన ట్రైనీలను అదే రోజు బయటకు గెంటేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఈ చర్యలను తమ నాణ్యత ప్రమాణాలను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయంగా సమర్థించుకుంటోంది. కానీ అప్పుడే కెరీర్ లోకి వస్తున్న యువత మానసిక ధైర్యంపై దెబ్బకొడుతున్నామన్న సంగతిని గుర్తించడానికి ఇష్టపడటం లేదు.