ఎన్టీఆర్.. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారని ఆయన కలలను మనం నిజం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ప్రధాని మోదీ సూచించారు. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొత్తం ఓ మ్యాజిక్ లా సాగిపోయింది. అమరావతిని ఓ శక్తిగా అభివర్ణించడమే కాదు..అది వికసిత్ భారత్ కు పునాది వంటిదని ప్రకటించారు. అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనూహ్యంగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావడం ద్వారా మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ కలలను నిజం చేయాల్సి ఉందన్నారు. అదే సమయంలో చంద్రబాబును పొగిడే విషయంలో మొహమాటాలు పెట్టుకోలేదు. సాంకేతికతలను మోదీ చాలా త్వరగా అడాప్ట్ చేసుకుంటారని చంద్రబాబు తన స్పీచ్ లో చెప్పారు. అయితే ఆ విషయంలో తన కంటే చంద్రబాబే ముుందుంటారని మోదీ నిర్మోహమాటంగా చెప్పారు.తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అభివృద్ధి విధానాలను అధికారులతో స్టడీ చేయించానన్నారు. అతి పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలంటే..దేశంలో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసి జీడీపీని పెంచుతారని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ పేరును కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము చేస్తున్న సహకారాన్ని కూడా వివరించారు. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని.. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందని హామీ ఇచ్చారు. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల సాయం చేస్తోందన్నారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది.. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందన్నారు.
ప్రధాని మోదీ ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ.. అందర్నీ ఆకట్టుకునేలా ప్రసంగించారు. అమరావతికి ప్రాధాన్యం ఇచ్చారు.. చంద్రబాబుు, పవన్ కల్యాణ్‌లను పొగిడారు. ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అభివృద్ధి పనులు,సంక్షేమం గురించి కూడా చెప్పారు. ఇతరులు అంతా.. పహల్గాం దాడి విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని ప్రకటించారు. అయితే అలాంటి విషయాలను ప్రధాని ప్రస్తావించడం మంచిది కాబట్టి దానిపై మాట్లాడలేదు.