ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి గతంలో జగన్ కోటరీలో కీలకంగా పని చేసిన అధికారుల అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. ఏ క్షణమైనా వారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి,గోవిందప్పలు ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించగా..హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డితోపాటు మరికొంతమందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిట్ సమాయత్తం అవుతోంది. నిందితులు తమ పేర్లను చెప్పడంతో సిట్ అధికారులు , రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తమను అరెస్ట్ చేయబోతున్నారని కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి,గోవిందప్పలు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది.
పిటిషనర్లకు ఇప్పటికిప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయం తర్వాతే బెయిల్ పై నిర్ణయం వెలువరిస్తామని , అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. ఈ ముగ్గురికీ హైకోర్టులో రిలీఫ్ దక్కకపోవడంతో ఏ క్షణమైనా క్రిష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.