మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు ఆక్రమించుకున్న భూములపై సర్వేను ఎట్టకేలకు ప్రారంభించారు. తిరుపతిలోని బుగ్గమఠం భూములను పెద్దిరెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారు. ఈ భూముల్లో అధికారులు సర్వేను చేపట్టారు. గత నెలలోనే ఈ సర్వే చేయాల్సి ఉంది. 16వ ఆర్థిక సంఘం పర్యటన కారణంగా బందోబస్తు సమస్యలు వస్తాయని వాయిదా వేశారు.
ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గత నెల 11న దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చారు. 261/1, 261/2 సర్వే నంబర్లలో 3.88 ఎకరాలు ఆక్రమించినట్లు నోటీసులు అందించారు. ఆ భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని చెబుతున్నారు. ద్వారకానాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఉదయం సర్వే కోసం వచ్చిన వారితో పెద్దిరెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. వారందర్నీ పోలీసులు పంపించివేశారు. బుగ్గమఠం భూముల్ని ఆక్రమించడం అందులో ప్రభుత్వ నిధులతోనే రోడ్డేసుకోవడం బహిరంగ రహస్యమే. ఇప్పుడు సర్వే చేసిన తర్వాత అధికారులు ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.