రాజకీయాల్లో రియాలిటీని ఎంతగా గుర్తిస్తే దానికి తగ్గట్లుగా పనితీరు మార్చుకుని అంతగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఊహాలోకంలో బతికేసి.. తమ పత్రికలు..తమ మీడియా..తమ సోషల్ మీడియాలో వచ్చేదే నిజమని నమ్మేసి… అదే చెప్పుకుంటూ తిరిగితే ప్రజలు కూడా వీళ్లకి రియాలిటీ అర్థం కాదని సైటైర్లు వేసుకుంటారు. లైట్ తీసుకుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విపక్ష పార్టీలు అదే స్థితిలో ఉన్నాయి.
ప్రజల్లోకే వెళ్లలేకపోతున్న వైసీపీ – అధికారపక్షం వెళ్లట్లేదని ఊహా
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది అవుతోంది. జగన్ రెడ్డి పార్ట్ టైమ్ లీడర్ గా పని చేస్తున్నారు. రెండు, మూడు రోజులు తాడేపల్లికి వచ్చి పథకాలు, కష్టాలు, బిర్యానీ అని ఎవరో కొంత మందిని పిలిపించుకుని పులిహోర కబుర్లు చెప్పి పోతున్నారు. ఎప్పుడైనా శవం లేస్తే అక్కడకు ఓ టూర్ పెట్టుకుంటున్నారు. టీడీపీ జనాల్లోకి వెళ్లలేకపోతోందని చెప్పుకుని స్వయంతృప్తి పొందుతున్నారు. ఆయన పూర్తిగా ఓ ఊహాలోకంలో ఉన్నారు. ఆయనను ఆ లోకంలో ఉంచి.. ఇతరులు తమ పని చేసుకుంటున్నారేమో తెలియదు కానీ.. అసలు నిజం మాత్రం జగన్ రెడ్డి ఇప్పటికీ రోడ్డెక్కలేకపోతున్నారు. బెట్టింగుల్లో నష్టపోయిన సొంత కార్యకర్తలు ఆయనను భయపెడుతున్నారన్నది అసలు నిజం. అసలు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి.. పని చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు.
రేపోమాపో ప్రమాణస్వీకారం చేస్తామని బీఆర్ఎస్ డ్రీమ్స్
భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఎంత సక్సెస్ అయిందో అని ఏడాదిన్నర తర్వాత చూసుకుంటే.. సోషల్ మీడియాలో ఊహా లోకపు పోరాటం తప్ప ప్రత్యక్షంగా చేసిందేమీ ఉండదు. ఆ పార్టీ పూర్తిగా సోషల్ మీడియా మీద ఆధారపడింది. రజతోత్సవసభను నిర్వహించారు కానీ.. అదో బహిరంగసభగా మారింది కానీ.. కార్యకర్తల్లో ఊపు తేలేకపోయింది. సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన ఊహా లోక్రం క్రియేట్ చేసుకుని…రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. రేవంత్ హైకమాండ్ కు దూరమయ్యారని.. ఎమ్మెల్యేలు రేవంత్ కు దూరమయ్యారని.. కథనాలు రాసుకుని సంతృప్తి చెందుతున్నారు. చివరికి ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా WWF ఫైట్లను కార్లలో చేసుకున్నారని రాసుకుని నవ్వుకుంటున్నారు. ఇలాంటివే అధికార పార్టీపై పోరాటం అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిన పోరాటం ఇది కాదు. కానీ అదే చేస్తున్నారు.
విపక్ష పార్టీలు బలంగా ఉండాలి..పోరాడాలి !
విపక్ష పార్టీలు రాజకీయం చేయాలి.. ఆ రాజకీయం ప్రజల కోణంలో ఉండాలి. రాజకీయకోణంలో ఉండకూడదు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలి. కానీ ఈ రెండింటి మధ్య గ్యాప్ ను తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. రాజకీయం అంటే… ఫేక్ న్యూస్ వేసి..సోషల్ మీడియాలో పాలకుల్ని తిట్టించి సంతృప్తి పడటం అన్నట్లుగా సాగిపోతోంది. మారితే తప్ప.. ఈ రాజకీయ పార్టీలకు భవిష్యత్ కనిపించడం కష్టం అనుకోవచ్చు.