నిన్న దర్శకుడు వేణు శ్రీరామ్ పుట్టిన రోజు. ఆయన చేతిలో ‘తమ్ముడు’ సినిమా ఉంది. నితిన్ హీరోగా నటించిన సినిమా ఇది. చాలా కాలంగా రిలీజ్డేట్ పెండింగ్ లో ఉంది. దాంతో రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ ఓ చిన్న వీడియో విడుదల చేసింది చిత్రబృందం. ఫన్నీ స్కిట్ లా డిజైన్ చేసిన ఈ వీడియో ఆకట్టుకొంటోంది. దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కరువై.. అంతా ‘రిలీజ్ డేట్ ఎప్పుడు సార్’ అంటూ వెంట పడడం బాగా పండింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారులంతా ఈ స్కిట్ లో కనిపించారు. హీరో నితిన్ తప్ప. నితిన్ కూడా ఉండి ఉంటే.. ఈ వీడియోకి పరిపూర్ణత వచ్చి ఉండేది.
‘రాబిన్ వుడ్’ ఫ్లాప్ తో నితిన్ కలవరపాటుకు లోనై ఉంటాడు. అంతకు ముందొచ్చిన ‘ఎక్స్ట్రా’ కూడా బాగా నిరాశ పరిచింది. ముఖ్యంగా ‘రాబిన్ వుడ్’ కోసం నితిన్ బాగా కష్టపడ్డాడు. ప్రమోషన్లలో విరివిగా కనిపించాడు. ఇది వరకెప్పుడూ లేనంత ఎఫర్ట్ పెట్టాడు. దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి కావల్సినంత ప్రమోషనల్ కంటెంట్ అందించాడు. అన్ని చేసినా, తనకు లక్ కలసి రాలేదు. బహుశా.. ఆ ఎఫెక్ట్ ‘తమ్ముడు’ పై పడి ఉండొచ్చు. పైగా ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ‘తమ్ముడు’ కోసం నితిన్ చాలా చేయాలి. హీరో ఎంట్రీ కాస్త లేట్ గా ఉంటుంది కాబట్టి, ఆలస్యంగానైనా సరే, ‘తమ్ముడు’ ప్రమోషన్ల కోసం నితిన్ దిగి రాక మానడు. పవన్ కల్యాణ్ హిట్ సినిమాల్లో ‘తమ్ముడు’ ఒకటి. ఆ సినిమా కూడా జులై నెలలోనే విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమానీ జులై 4న విడుదల చేయబోతున్నారు.