ఉగ్రవాదుల అంతం చూడటానికి భారత్ పొజిషన్ రెడీ చేసుకుంటోంది. ఓ వైపు పాకిస్తాన్ .. భారత్ తనపై దాడి చేయబోతోందని వణికిపోతోంది. తమపై దాడి చేస్తే అణుబాంబులేస్తామని కీచుగొంతుతో బెదిరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని భారత్ చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు క్లారిటీ ఇస్తోంది. తాము చేపట్టే చర్యలపై ఎవరికీ అభ్యంతరాలు లేకుండా.. పాకిస్తాన్ కు ఎలాంటి సపోర్టు దక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఉగ్రవాదులపై దాడిచేస్తే పాకిస్తాన్కు ఉలుకు ఎందుకు ?
భారత్ తాము ఎప్పుడూ పాకిస్తాన్ పై దాడులు చేయబోతున్నామని చెప్పలేదు. తమ దేశంలోకి చొరబడి రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల అంతం చూడటానికి మాత్రమే ఆపరేషన్ చేయబోతున్నామని అంటోంది. అసలు సమస్య ఏమిటంటే ఆ ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంటున్నారు. అది పాక్ అధీనంలోని భూభాగం. అక్కడి టెర్రరిస్టులకు పాకిస్తాన్ అండ ఉంది. అందుకే అంత భయపడుతోంది. ఇండియా దాడిచేస్తే .. అది టెర్రరిస్టులపై కాదని.. తమపైనే అన్నంతగా ప్రచారం చేస్తోంది. అంటే టెర్రరిస్టుల్ని కాపాడుతున్నట్లుగా పాకిస్తాన్ పరోక్షంగా చెబుతోంది.
ముందే ఉగ్రవాదుల్ని హతం చేస్తే పాకిస్తాన్ సేఫ్
పాకిస్తాన్ కు ఇప్పుడు ఒక్కటే దారి ఉంది. అదేమిటంటే.. ఉగ్రవాదులపై భారత్ దాడి చేయక ముందే తానే హతం చేయడం. తమ పీకల మీదకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వారిని వదించుకోవడం పాకిస్తాన్ కు సేఫ్. ముఖ్యంగా ఉగ్రవాదులకు మాస్టర్ మైండ్ లా ఉన్న హఫీజ్ సయీద్ ను అంతం చేస్తే ఉగ్రవాదులపై భారత్ యుద్ధం చాలా వరకూ పూర్తి అయినట్లు అవుతుంది. కానీ సయీద్ ను ప్రత్యేకంగా కాపాడుతున్నారు. అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్టులోనూ సయీద్ ఉన్నారు. ఇలా చేయడం వల్ల అమెరికానూ సంతృప్తి పరచవచ్చు.
పాకిస్తాన్ కు డూ ఆర్ డై సిట్యూయేషన్
పాకిస్తాన్ ఇప్పుడు .. పూర్తి స్థాయి ఉగ్రవాద దేశంగా మారాలా లేకపోతే.., ప్రపంచంతో కలిసి పురోగమించేందుకు కదలాలా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉగ్రవాదుల్ని అంతం చేస్తే.. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ను కలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది. లేకపోతే ఆ దేశానికి వెళ్లేవాళ్లు..చూసేవాళ్లు కూడా ఉండరు. భారత్ ఉగ్రవాదంపై పోరాటం ఆపదు. భారత్ పై కన్నెత్తి చూసే ఉగ్రవాదుల అంతం చూడటం ఖాయం. ఉగ్రవాదమే కావాలనుకుంటే పాకిస్తాన్ యుద్ధానికి రావొచ్చు కానీ ఆ తర్వాత పరిస్థితేమిటన్నది ఊహకు అందని విషయం.