అంగళ్లులో చంద్రబాబుపై హత్యాయత్నం చేసి, ఆయనపైనే కేసులు పెట్టారు. ఈ కేసుల్లో చంద్రబాబు హత్యాయత్నం చేశాడని కోర్టులో వాదించిన లాయర్లలో ఒకరిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. చంద్రబాబు కోసం వాదించిన లాయర్ ను నియమిస్తే మామూలే అనుకోవచ్చు కానీ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఆయనేదో కత్తి పట్టుకుని వీరంగం చేశారని హత్యాయత్నం చేశారన్నట్లుగా కోర్టులో వాదించిన లాయర్ కు పదవి ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో గగ్గోలు రేగడంతో తొలగించారు. ఎవరు సిఫారసు చేశారో అని ఆరా తీస్తున్నారు. అది తెలుసుకోవడం ఏమన్నా పెద్ద విషయమా?.
సింహాచలం దుర్ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్న ఇంజినీర్ వైసీపీ పెద్దలకు సన్నిహితుడు. రుషికొండ భవన్ నిర్మాణంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఆయనకు టీడీపీ ప్రభుత్వం వచ్చాక మరో రెండు పోస్టులు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఎనిమిది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామంటున్నారు. అక్కడ లాయర్ అయినా.. ఇక్కడ ఇంజినీర్ అయినా.. వారికి ప్రాధాన్యం దక్కిందంటే తప్పు ఎవరిది ?. ఇటీవల వరుసగా కోర్టుల్లో సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల నిందితులు విడుదలవుతున్నారు. దీనికి ఎవరిది బాధ్యత?
అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సానుభూతిపరులకు ప్రాధాన్యం ఇస్తున్నారో లేదో వారికే తెలియాలి. కానీ వైసీపీ తరపున పని చేసిన వారు మాత్రం తమ ప్రాధాన్యతను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. వారు విధేయతను మార్చుకుని ఉండవచ్చు..కానీ అలాంటి వారికి నైతికత ఎక్కడ ఉంటుంది?. ద్రోహం చేయరని నమ్మకం ఏమిటి ?. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు పదుల సార్లు వైసీపీ సానుభూతిపరుల్ని నెత్తిన పెట్టుకుంటున్నారన్న విషయాన్ని బయట పెట్టారు. వారి ఒత్తిడి మేరకు కొంత మందిని తొలగించారు. అయితే చాలా మంది మాత్రం టీడీపీ పై స్వారీ చేస్తూనే ఉన్నారు.
టీడీపీ సానుభూతిపరులకు అవకాశాలు కల్పించినా కల్పించకపోయినా . .. కనీసం వైసీపీ నుంచి వచ్చే కోవర్టులకు, జగన్ సానుభూతిపరులకు మాత్రం అవకాశాలు కల్పించవద్దని వేడుకుంటున్నారు. కానీ టీడీపీ వ్యవస్థలో వైసీపీ రక్తం కలిసిపోయినట్లుగా ఉందన్న ఆవేదన చివరికి క్యాడర్ లో పెరిగిపోతోంది.