దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో ఉన్న ట్రెండ్ కన్నా ఎక్కుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ప్రభావం కనిపిస్తోంది. ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. దానికి అనేక కారణాలు ఉండొచ్చు..కానీ తగ్గుదల అనేది మాత్రం చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కేవలం అధిక లాభాలు ఆశించిన వ్యాపారులకు మాత్రమే ఇబ్బందికరం. కానీ సొంత ఇల్లు అనే భావనలో ఉండే మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఎంతో అనుకూలం. వారు ఇప్పుడు ఇల్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో పెరిగిపోతున్న స్కై స్క్రాపర్ల సంస్కృతి ఇప్పటికీ ఉన్నత వర్గాలకే అందుబాటులోకి ఉంది. అత్యంత విశాలమైన ఇళ్లు, లగ్జరీ సౌకర్యాలు, భద్రత, అన్నీ వ్యవహారాలు చూసుకునేందుకు సిబ్బంది ఉండటం చిన్న విషయం కాదు. అలాంటి కమ్యూనిటీలు కనీసం ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చేలా ధరలు తగ్గితే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఎంతో మేలు జరుగుతుంది.
ప్రస్తుతం బడా బిల్డర్లు నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అన్ని రకాలుగా ఖర్చులు వేసి ఎస్ఎఫ్టీకి పది వేల వరకూ చేస్తున్నారు. దీన్ని ఏడు వేల వరకూ తగ్గిస్తే.. ఎగువ మధ్యతరగతి ఈ లగ్జరీ మార్కెట్ వైపు వచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి మాత్రం ఇంకా మామూలు అపార్టుమెంట్లు, ఇళ్లకే పరిమితం అవుతుంది. వారికి అందుబాటులోకి వచ్చేంతగా ధరలు తగ్గితే సంక్షోభం వస్తుంది. మధ్యతరగతి ఆదాయ వనరులు పెరిగి జీవన ప్రమాణాలు పెరిగితే.. అప్పుడు స్కై స్క్రాపర్లకు మరింత డిమాండ్ పెరుగుతుంది.
ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ధరల తగ్గింపు ట్రెండ్ వల్ల.. కొత్త , సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చేసిందని అనుకోవచ్చు. బ్యాంకుల వడ్డీరేట్లు కూడా తగ్గుతూండటం..మరో ప్లస్ పాయింట్.